కొత్త సీఎస్‌గా జయేశ్‌? | CS Ramakrishna Rao to retire at the end of the month | Sakshi
Sakshi News home page

కొత్త సీఎస్‌గా జయేశ్‌?

Jun 15 2026 1:16 AM | Updated on Jun 15 2026 1:16 AM

CS Ramakrishna Rao to retire at the end of the month

జయేశ్‌ రంజన్‌ , వికాస్‌రాజ్‌

నెలాఖరులో సీఎస్‌ రామకృష్ణారావు పదవీ విరమణ

రేసులో ముందున్న కోర్‌ అర్బన్‌ ఏరియా స్పెషల్‌ సీఎస్‌

గట్టి పోటీనిస్తున్న ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌

వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారికే పట్టం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియారిటీ, అనుభవం, విధేయతతోపాటు భయం లేకుండా ధైర్యంతో సత్వర నిర్ణయాలు తీసుకోగల అధికారిని కొత్త సీఎస్‌గా నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఈ నెల 11తో రెండున్నరేళ్ల సమయం గడిచిపోయింది. 

మిగిలిన రెండున్నరేళ్ల టర్మ్‌లో చివరి ఏడాది.. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలుపొందడంపైనే ప్రభుత్వం పూర్తిగా దృష్టిసారించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థూలంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా పరుగులు పెట్టించి సర్కారును మళ్లీ గెలిపించుకోవడానికి దూకుడుగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గల అధికారినే తదుపరి సీఎస్‌గా నియమించే అవకాశముంది. 

ఏ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయాందోళనలతో చాలామంది ఐఏఎస్‌లు సత్వర నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో సర్కారుకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే పురపాలక శాఖ (క్యూర్‌ ఏరియా) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు పట్టం కట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనతోపాటు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది.

నిర్ణయాల్లో చురుకుదనమే గీటురాయి
జయేశ్, వికాస్‌రాజ్‌లలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం మెండుగా ఉండగా, సీనియారిటీ ప్రకారం రేసులో శశాంక్‌ గోయల్‌ (1990 బ్యాచ్‌) అందరికంటే ముందున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన వచ్చే సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండడంతో మరో మూడు నెలల సర్వీసు కాలం మాత్రమే మిగిలింది. సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న అరవింద్‌కుమార్‌ (1991 బ్యాచ్‌) ఫార్ములా ఈ–కారు రేసు కేసులో చిక్కుకుని కొంత కాలంగా సస్పెన్షన్‌లో ఉండటంతో ఆయన రేసులో లేరు. 

సీనియారిటీలో ఆ తర్వాతి స్థానంలో జయేశ్‌ రంజన్‌ (1992) ఉండగా, ఆయన 2027 సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేస్తారు. ఏదైనా పని అప్పగిస్తే అత్యంత వేగంగా ఫలితాన్ని తెచ్చి చూపించే అధికారుల్లో జయేశ్‌ ముందు వరుసలో ఉంటారని పేరుంది. సీఎస్‌ ఎంపికలో ఇదే ఆయనకు కలిసి రానుండగా, ఆయన సామాన్యులకు అందుబాటులో ఉండరనే విమర్శ సైతం ఉంది. సీనియారిటీలో జయేశ్‌ తర్వాత ఉన్న సంజయ్‌జాజు (1992) డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేస్తున్నారు. 

ఆయన 2029 ఫిబ్రవరి 28న రిటైర్‌ కానుండగా, రాష్ట్రానికి తిరిగి వచ్చే ఆలోచనలో లేరని తెలిసింది. ఆతర్వాతి స్థానంలో ఉన్న వికాస్‌రాజ్‌(1992)కు వివాదరహితుడిగా పేరుండగా, 2028 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. జయేశ్‌ను కాదని భావిస్తే వికాస్‌రాజ్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, ఆయన చురుగ్గా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుతారని, ‘హామ్‌’రోడ్ల టెండర్లలో తీవ్ర జాప్యానికి సైతం ఇదే కారణమనే భావనలో ప్రభుత్వం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement