మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజుర్‌నగర్: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు.
వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యవసాయం ఒక పండుగలా మారిందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి నమోదైందని, భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఏడు రకాల సన్న వరిధాన్యాలకు బోనస్ కూడా కొనసాగుతోందని, ఈ చర్యల వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు.
అయితే ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు.వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని, 2026 జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే సుమారు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఇది ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు.
తెలంగాణలో కూడా జూన్ నెలలో సుమారు 22 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో పలు ప్రాంతాల్లో విత్తనాల విత్తడం ఆలస్యమైందన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉండటంతో అక్కడ కూడా వర్షాలు తక్కువగా కురవడం వల్ల తెలంగాణకు గోదావరి జలాల ప్రవాహం ఆలస్యమవుతోందని మంత్రి వివరించారు.
నీటి లభ్యత అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగలిగే, ఎండలను తట్టుకునే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అనంతరం సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
వర్షపాతం తక్కువగా కొనసాగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ ఎంతో కీలకమని చెప్పారు.వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పొడి వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటూనే నీటి వినియోగంలో సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక, రైతుల సహకారంతో ఎల్‌నినో సవాళ్లను అధిగమించి తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి పథంలో కొనసాగుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా గడ్డిపల్లి గ్రామంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత పాఠశాల (ఇంటిగ్రేటెడ్ స్కూల్) నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. హుజూర్‌నగర్ పట్టణంలో రూ.7.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను ఆయన పరిశీలించారు. అలాగే చిలుకూరు–జెర్రిపోతులగూడ మధ్య నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.


