నచ్చినవారికి.. నచ్చిన చోట.. | Criticism on General Transfers of Employees in Treasury Department | Sakshi
Sakshi News home page

నచ్చినవారికి.. నచ్చిన చోట..

Jun 2 2026 5:58 AM | Updated on Jun 2 2026 5:58 AM

Criticism on General Transfers of Employees in Treasury Department

ట్రెజరీ బదిలీల తీరు ఇదీ.. స్పౌజ్‌ లేదు.. మెడికల్‌ లేదు..ఉద్యోగ సంఘాల నేతలమంటూ ఫేక్‌ లెటర్లతో హవా

జీఓ నం: 38 నిబంధనలకు విరుద్ధంగా సీనియర్‌ అకౌంటెంట్లు, ఎస్టీఓల బదిలీలు

ఇద్దరు సచివాలయ అధికారుల తీరు కారణంగా పదుల సంఖ్యలో ఉద్యోగులకు అవస్థలు

సాక్షి, హైదరాబాద్‌: ఖజానా శాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. బదిలీలకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం: 38 స్ఫూర్తికి విరుద్ధంగా ఆ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అకౌంటెంట్లు, సబ్‌ ట్రెజరీ అధికారుల (ఎస్టీఓలు)ను బదిలీ చేశారని, సచివాలయ స్థాయిలో పనిచేసే ఇద్దరు అధికారుల తీరుతో పదుల సంఖ్యలో ట్రెజరీ ఉద్యోగులు అవస్థలు పడాల్సి వస్తోందని ఆ శాఖ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీసం స్పౌజ్‌ గ్రౌండ్‌ను పట్టించుకోలేదని, మెడికల్‌ గ్రౌండ్స్‌ను ఖాతరు చేయలేదని, ఉద్యోగుల విజ్ఞప్తులను పక్కన పెట్టి తమకు నచ్చిన వారికి నచ్చిన చోట పోస్టింగులు కట్టబెట్టారని అంటున్నాయి. మూడేళ్ల నుంచి నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారు కోరుకుంటేనే బదిలీ చేయాలని నిబంధనలు చెబుతుంటే..మూడేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేస్తామంటూ తొలుత భయపెట్టిన అధికారులు ఆ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి జోక్యంతో వెనక్కి తగ్గారని, అయినా తెర వెనుక మంత్రాంగం నడిపించి పోస్టింగుల కేటాయింపులో అడ్డగోలుగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల్లోని నాయకుల విషయంలో సదరు సంఘాలు నిర్ధారించిన పక్షంలో వారిని యథాతథంగా కొనసాగించొచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని టీఎన్జీఓల పేరుతో ఫేక్‌ లెటర్లు తెచ్చుకున్నా పట్టించుకోకుండా వాటి ఆధారంగా ఉద్యోగుల బదిలీలు నిలిపివేశారని ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపిస్తుండడం గమనార్హం. ఈ విషయమై సచివాలయ అధికారులను సంప్రదిస్తే తమ ఇష్ట ప్రకారం చేస్తామని, తాము చేసిన చోటకు బదిలీపై వెళ్లాల్సిందేనని హుకూం జారీ చేస్తున్నారని, ఎవరికి చెప్పుకున్నా తమకేమీ కాదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో ఆర్థికమంత్రి జోక్యం చేసుకొని ట్రెజరీ శాఖ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 

ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్న ప్రకారం ట్రెజరీల్లో జరిగిన అడ్డగోలు బదిలీల్లో మచ్చుతునకలివే..
నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య నల్లగొండలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అతను స్పౌస్‌ గ్రౌండ్‌లో బదిలీకి దరఖాస్తు చేసుకున్నాడు. అలాంటి సందర్భంలో ఆయన్ను క్లియర్‌ వేకెన్సీ ఉన్న నల్లగొండకు బదిలీ చేయాలి. కానీ నల్లగొండ–నకిరేకల్‌ కంటే దూరంగా ఉండే నిడమనూరు ఎస్టీఓకు బదిలీ చేశారు. 
⇒ తన భార్యకు కేన్సర్‌ ఉందని, హాలియాలో ఉన్న ఆమెకు తోడుగా ఉండేందుకు నిడమనూరుకు బదిలీ చేయాలని మెడికల్‌ గ్రౌండ్‌లో ఓ ఉద్యోగి ఆప్షన్‌ ఇస్తే..ఆయన పనిచేస్తున్న దేవరకొండ నుంచి హాలియాకు దూరంగా ఉండే నాంపల్లికి బదిలీ చేశారు. 
⇒ మణుగూరు నుంచి నేలకొండపల్లికి స్పౌస్‌ గ్రౌండ్‌లో బదిలీ అడిగితే పట్టించుకోకుండా ఏకంగా వరంగల్‌ డీటీఓకు బదిలీ చేశారు. 

⇒ ఖమ్మం జిల్లా కేంద్రంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకురాలిగా ఉన్న ఓ మహిళా అధికారిణి తనను అదే స్థానంలో కొనసాగించాలని అడిగితే ఆమెను మరిపెడ బంగ్లాకు బదిలీ చేశారు. అదే ఖమ్మం స్థానంలో వరంగల్‌ నుంచి మరో మహిళను బదిలీ చేశారు. అయితే, బదిలీపై ఖమ్మం వచ్చిన ఆ అధికారిణి అసలు విధుల్లోనే లేరని, దీర్ఘకాలిక సెలవుపెట్టి కెనడాలో ఉన్నారని సమాచారం. 
⇒ మరో విచిత్రమేమిటంటే ఒక్క నల్లగొండ జిల్లాలోనే 20 మందిని ఉద్యోగ సంఘాల నాయకులంటూ ఫేక్‌ లెటర్లు ఇచ్చినా, అవేమీ పట్టించుకోకుండా యథాతథ స్థానాల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒక్క ట్రెజరీ శాఖకు చెందిన వారే 20 మంది ఉండే ఏ ఉద్యోగ సంఘం ఉంటుందో కూడా అర్థం కావడం లేదని ఆ శాఖ ఉద్యోగ సంఘాలే వాపోతుండడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement