వచ్చింది.. పోయింది!

COVID 19 Affect Antibody Tests in Hyderabad - Sakshi

నగరంలో జోరుగా యాంటీబాడీ టెస్టులు 

లక్షణాలు లేకుండానే.. కరోనా బారిన  

తాజా పరీక్షల్లో వచ్చి.. పోయినట్లు నిర్ధారణ 

రెండు మూడు మాసాల వరకు శరీరంలోనే.. 

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 80 శాతం మందిలోఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కానీ.. పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. ఎవరిలో వైరస్‌ఉందో? ఎవరిలో లేదో? గుర్తించడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం వైరస్‌ అసింప్టమేటిక్‌గా ఉండటంతో బాధితులకు కూడా తెలియడంలేదు. ఇప్పటివరకు తమకు వైరస్‌ సోకిందో? లేదో? తెలుసుకునేందుకు యాంటీబాడీ టెస్టుల కోసం సిటీజన్లు ప్రైవేటు డయాగ్నోస్టిక్‌లకు క్యూ కడుతున్నారు. ప్రజల్లోని భయాన్ని కొన్ని డయాగ్నోస్టిక్‌ లేబొరేటరీలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఒక్కో టెస్టుకు రూ.1500కుపైగా వసూలు చేస్తున్నాయి. నిజానికి ఇప్పటికే వైరస్‌ బారినపడి.. కోలుకుని ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు వచ్చినవారికి మాత్రమే యాంటిబాడీ టెస్టులు నిర్వహిస్తారు. కానీ, నగరంలోని పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ లేబొరేటరీలు ఎలాంటి లక్షణాలు లేనివారి నుంచి కూడానమూనాలు సేకరించి టెస్టులు చేస్తుండటంగమనార్హం. ప్రభుత్వం నుంచి ఈ టెస్టులకు అనుమతి లేకపోయినప్పటికీ.. ప్లాస్మా దానం పేరుతో సాధారణ యువతకు కూడా యాంటిబాడీ టెస్టులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.    

వైరస్‌ క్యారియర్లుగా యువత.. 
నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, మార్కెటింగ్‌ రంగాల్లో పని చేస్తున్నవారు ఉన్నారు. వీరితో పాటు ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేస్తున్నవారు ఎక్కువగా పక్కపక్కనే కూర్చొని పని చేయాల్సి వస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలు ఉంటారు. వీరిలో చాలా మంది మధుమేహం, హైపర్‌టెన్షన్, కేన్సర్, హృద్రోగ సంబంధ సమస్యతో బాధపడుతున్నవారు ఉన్నారు. ముఖ్యంగా యువకులు, మధ్య వయస్కులు ఉద్యోగరీత్యా బయట తిరిగి ఇంటికి వస్తుంటారు. వీరిలో చాలా మంది తమకు తెలియకుండానే వైరస్‌ క్యారియర్లుగా మారుతున్నారు. వైరస్‌ సోకినట్లు కూడా వీరికి తెలియదు. దీంతో వారంతా కుటుంబ సభ్యులతో యథావిధిగా కలిసి ఉంటున్నారు. బయటి నుంచి వైరస్‌ మోసుకొచ్చి ఇంట్లో ఉన్న వృద్ధులకు విస్తరింపజేస్తున్నారు. వీరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా వైరస్‌కు ఎఫెక్ట్‌ అవుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరిస్తోంది. తీరా వృద్ధులకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మిగిలిన కుటుంబ సభ్యులు అప్రమత్తమవుతున్నారు. అప్పటికే నష్టం జరిగిపోతోంది.  (మా సత్తా ఏంటో తెలిసింది!)

క్యాష్‌ చేసుకుంటున్న సెంటర్లు..   
లాక్‌డౌన్‌తో మార్చి నుంచి జూన్‌ వరకు జనాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులను 50 శాతానికి పరిమితం చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించి రెండు నెలలు పూర్తయ్యింది. ఉద్యోగులు ఎక్కువ కాలం ఆఫీసుకు దూరంగా ఉండటంతో ప్రాజెక్టులు ఆగిపోయి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇకపై వర్క్‌ ఫ్రం హోం కొనసాగిస్తే.. సంస్థలతో పాటు ఉద్యోగులు కూడా నష్టపోవాల్సి వస్తుందని భావించిన పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను యాంటీబాడీ టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఐజీజీ, ఐజీఎం లెవల్స్‌ను గుర్తిస్తున్నాయి. శరీరంలో యాంటీబాడీస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారిని తిరిగి ఆఫీసుకు రావాల్సిందిగా సూచిస్తున్నాయి. యాంటీబాడీస్‌ లేని వారిని మరికొంత కాలం ఇంటి నుంచే పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలతో కలిసి ఉన్న వారు యాంటీబాడీ టెస్టుల కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ల వద్ద క్యూ కడుతున్నారు. సిటిజనుల్లో ఉన్న ఈ బలహీనతను పలు డయాగ్నోస్టిక్‌ సెంటర్లు క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాంపిళ్ల సేకరణ కోసం ఏజెంట్లను నియమించుకున్నాయి. టెస్టులపై కనీస అవగాహన లేని వారితో నమూనాలు సేకరించి టెస్టులు చేస్తుండటం గమనార్హం.

ఇమ్యూనిటీ ఉందో? లేదో? తెలుస్తుంది  
బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్‌ ఏ స్థాయిలో ఉన్నాయో? తెలుసుకునేందుకు  యాంటీబాడీ టెస్టులు చేస్తారు. ముఖ్యంగా హెల్త్‌కేర్‌ వర్కర్లకు, ప్లాస్మా దాతలకు, రోజుల తరబడి ఇన్‌ఫెక్టెడ్‌ కేసులకు క్లోజ్‌గా ఉన్నవారికి టెస్టులు అవసరం. యాంటీబాడీస్‌ వృద్ధి చెందిన వారు ధైర్యంగా మరికొంత కాలం ఉండొచ్చు. మరింత మందికి సేవలు అందించొచ్చు. అంతేగాని ఎవరు పడితే వారు ఈ టెస్టులు చేయించుకోవడం ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదు.
– డాక్టర్‌ నవోదయ, జనరల్‌ ఫిజిషియన్, కేర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top