
నేటి అధికార కాంగ్రెస్ పార్టీ కీలక భేటీలో నిర్ణయం
పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి.. ముందుకెళ్లడంపైనా చర్చ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ఓటు చోరీ, యూరియా అంశాలపై కూడా...
మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం
రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు పీసీసీ సలహా కమిటీ సమావేశం కూడా
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక భేటీ నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు సలహాకమిటీ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకొని తమ వైఖరిని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు రాష్ట్ర మంత్రులు, రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.
ఎజెండా ఇదే....!
గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఐదారు కీలకాంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ముడిపడి ఉన్న బీసీల రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై కూడా నేతలు చర్చించనున్నారు.
అయితే, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని, చట్టపరంగా కల్పించలేని పక్షంలో పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు ప్ర«తిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు అనుసరిస్తున ద్వంద్వ, అస్పష్ట వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరోమారు అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని కూడా చర్చించనున్నారు.
అయితే, ఈ విషయంలో పీఏసీలోని అందరి సభ్యుల అభిప్రాయాలను తీసుకొని, మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు చోరీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల, జిల్లా పార్టీ కమిటీల నియామకం, రాష్ట్రంలో యూరియా కొరత, ప్రతిపక్ష పార్టీల వైఖరి తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని సమాచారం.