
ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులపై కమిటీ స్పష్టత
పెద్ద కాలేజీల్లో ఫీజులు మరింత పెంపు
డోలాయమానంలో చిన్న కాలేజీలు
ప్రత్యేక కమిటీ నివేదిక సిద్ధం
సీఎంతో కమిటీ సభ్యుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై త్వరలో స్పష్టత రానుంది. ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ పలు అంశాలతో నివేదిక రూపొందించింది. కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బుధవారం సమావేశమై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలో కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కొన్ని సూచనలు చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించి నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ నివేదికను ఒకటిరెండు రోజుల్లో సీఎంకు పంపే అవకాశం ఉంది. 2025–26 నుంచి 2028–29 బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది.
పెద్ద కాలేజీలకే పండగ
రాష్ట్రంలోని 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. అత్యున్నత, మధ్యస్థ, అతి తక్కువ ప్రమాణాలుగా కేటగిరీలు చేస్తున్నారు. మొత్తం కాలేజీల్లో 115 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాల్లో ఉన్న 41, హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో 50 కలిపి మొత్తం 91 కాలేజీలు సాధారణ ప్రమాణాలతో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిల్లో 45 కాలే జీల్లో కనీస స్థాయి ప్రమాణాలు ఉన్నాయని భావిస్తున్నారు. జాతీయ ర్యాంకుల్లో ఇవి వెనుకబడి ఉన్నాయి. కాలేజీల ఆడిట్ నివేదికల ఆధారంగా వీటికి కూడా ఏటా ఫీజులు పెంచుతున్నారు.
మొత్తంగా 5 నుంచి 7 శాతం మేర ప్రతి మూడేళ్లకు ఫీజులు పెరుగుతున్నాయి. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర జాతీయ ర్యాంకులున్న కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచాలని, ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న కాలేజీలను ఫీజుల పెంపునకు అనుమతించాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది. టాప్ కాలేజీలు మాత్రమే ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి. కమిటీ నివేదిక ప్రకారం టాప్ కాలేజీలకు మాత్రమే ఫీజులు పెరిగే వీలుంది.
చిన్న కాలేజీలకు ఫీజుల కోత, లేదా సాదాసీదా పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాగా, రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. వీటిని కట్టడి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఏఐసీటీఈ వీటికి అనుమతి ఇస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం డీమ్డ్ వర్సిటీలకు నిరభ్యంతర పత్రాలు ఇస్తుంది. ఇలా ఎన్‌ఓసీ పొందిన వర్సిటీల పత్రాలను పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.