
కాలేజీలతో మరోసారి కసరత్తు చేయాలని ఎఫ్‌ఆర్‌సీకి ప్రభుత్వం సూచన
ఆడిట్ నివేదికలు.. కాలేజీ డాక్యుమెంట్లు పునఃపరిశీలించాలని ఉత్వర్వులు
నాణ్యతా ప్రమాణాల్లో పురోగతి ఆధారంగా ఫీజుల పెంపు
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో తాజా షెడ్యూల్ విడుదల చేసిన ఎఫ్‌ఆర్‌సీ
ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఫీజులపై మరోసారి కసరత్తు చేయాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీజీఎఫ్‌ఆర్‌సీ)కి ప్రభుత్వం సూచించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సిఫార్సులను ఉత్తర్వులో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 160 కాలేజీలతో ఎఫ్‌ఆర్‌సీ తిరిగి సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం సూచించింది. కాలేజీలు గతంలో సమర్పించిన పత్రాలు, ఖాతా పుస్తకాలను మళ్లీ పరిశీలించాలని పేర్కొంది. ఎఫ్‌ఆర్‌సీకి సమర్పించే వివరాలన్నీ నిజమైనవేనని కాలేజీల నుంచి నోటరీ అఫిడవిట్ తీసుకోవాలని.. ఒకవేళ ఏ విషయమైనా నిజం కాదని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జీవోలో ఆదేశించింది. ఫీజుల నిర్ధారణలో ఎఫ్‌ఆర్‌సీకి పూర్తి స్వేచ్ఛ ఉందని.. కాలేజీ నాణ్యతను నిర్ణయించి ఫీజులు ఖరారు చేసే అధికారం ఇస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది.
కాగా, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే టీజీఎఫ్‌ఆర్‌సీ సమావేశమై 2025–2028 బ్లాక్ పీరియడ్‌కు ఫీజుల ఖరారు మార్గదర్శకాలపై చర్చించింది. అనంతరం కాలేజీలతో సంప్రదింపులు, పత్రాల పరిశీలనకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ ఈ నెల 25 నుంచి మొదలై సెప్టెంబర్ 3తో ముగియనుంది. -సాక్షి, హైదరాబాద్
ఫీజుల పెంపునకు ఇవే ప్రామాణికం
» ఫీజుల నిర్ధారణకు ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని కమిటీ కొన్ని సూచనలు చేసింది. వాటిని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం ప్రధానంగా ఆరు మార్గదర్శకాలను సూచించింది.
»కాలేజీలో నాణ్యతాపరమైన విద్యను ఫీజు పెంపునకు కొలమానంగా తీసుకోవాలి. నాణ్యత కల్పించే భరోసా కాలేజీలో ఏ మేరకు ఉందో గుర్తించాలి. ఫ్యాకల్టీ, సరికొత్త మార్పులు, విద్యార్థి విజ్ఞానాన్ని పెంచేందుకు తీసుకొనే చర్యలను ప్రామాణికంగా తీసుకోవాలి.
» కాలేజీలో చదివే విద్యార్థుల పురోగతి ఎలా ఉంది? విద్యార్థులకు ఏ స్థాయిలో ప్రేరణ కల్పిస్తున్నారు? వారి హాజరు శాతం ఏ విధంగా ఉంది? ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థుల పురోగతిలో మార్పు, ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఏ స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
» ముఖ ఆధారిత గుర్తింపు హాజరు విధానం, ఆధార్ అనుసంధాన చెల్లింపు పద్దతుల్లాంటి ఆధునిక విధానాలను ఫీజుల పెంపునకు ప్రామాణికంగా తీసుకోవాలి. జమా ఖర్చులు సహా అన్ని విషయాల్లో పారదర్శకత, జవాబుదారీతనంలో కాలేజీ తీరును ఫీజు పెంపునకు ఒక అర్హతగా నిర్ణయించారు.
» నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్), నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) వంటి జాతీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ర్యాంకులు పొందిన సంస్థలను ఫీజుల పెంపునకు కొలమానంగా తీసుకోవాలి.
» ప్రభుత్వం అందించే సాంకేతిక విద్యను ఏ మేరకు అనుసరిస్తున్నారు? దీన్ని ఆధారంగా చేసుకొని ఉన్నత ప్రమాణాలతో బోధన అందించే విధానాలను పరిశీలించాలి.
ఈ ఏడాది పెంపు లేనట్టే!
ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఇప్పటికే పూర్తవగా అంతర్గత స్లైడింగ్, అన్ని కాలేజీల్లో ఓరియంటేషన్ సైతం ముగిసింది. క్లాసులు కూడా పూర్తిస్థాయిలో మొదలవనున్నాయి. 2025–26 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులు పాత బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులే చెల్లించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎఫ్‌ఆర్‌సీ 160 కాలేజీల డాక్యుమెంట్లు, ఆడిట్ నివేదికలను పునఃపరిశీలించాలి.
ఆ తర్వాత ఫీజులపై ఓ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. అయితే ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఫీజులు పెంచినా ఈ ఏడాదికి మాత్రం అవి అమలయ్యే అవకాశం కనిపించడంలేదు. ఫీజులపై ఆరు వారాల్లో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఫీజులపై పునఃపరిశీలన చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.