విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి | CM Revanth on supply of uniforms, books other equipment to Govt schools | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి

May 1 2026 2:36 AM | Updated on May 1 2026 2:36 AM

CM Revanth on supply of uniforms, books other equipment to Govt schools

స్కూళ్లకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర సామగ్రి సరఫరాపై సీఎం రేవంత్‌రెడ్డి 

వస్తువులన్నీ నాణ్యమైనవే అయ్యుండాలి.. జూన్‌ 15లోగా స్కూళ్లకు పంపాలి 

విద్యా సామగ్రి కేంద్రీకృత సేకరణ విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్‌లు, స్కూల్‌ బ్యాగ్‌లు, ఐడీ కార్డులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి అంతా నాణ్యమైనవే అయ్యుండాలని.. అవన్నీ జూన్‌ 15లోగా స్కూళ్లకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సామగ్రి అందాక వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖతోపాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అందించే సామగ్రి కేంద్రీకృత సేకరణ విధానంపై సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సమీక్షించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ సేకరణ, సరఫరా చేపట్టడంతో నాణ్యత లోపంతోపాటు అక్రమాలు జరిగేవని.. వాటిని అరికట్టేందుకే కేంద్రీకృత సేకరణ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పా రు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి గడువులోగా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

మండలానికో నోడల్‌ అధికారి... 
విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని.. సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్‌ సీఈవో దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, గురుకులాల కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement