నర్సరీ టు ఇంటర్‌ ఒకే క్యాంపస్‌లో.. | CM Revanth Reddy to unveil the Telangana Public School pylon at Arutla today | Sakshi
Sakshi News home page

నర్సరీ టు ఇంటర్‌ ఒకే క్యాంపస్‌లో..

Jun 17 2026 4:14 AM | Updated on Jun 17 2026 4:14 AM

CM Revanth Reddy to unveil the Telangana Public School pylon at Arutla today

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ పైలాన్‌ను నేడు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయనున్న సీఎం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యారంగంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌) నూతన విద్యా విప్లవానికి నాంది పలకబోతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల కేంద్రంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ పైలాన్‌ను బువారం ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్స్, డైనింగ్‌ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయనున్నారు. అనంతరం స్కూలుకు సమీపంలో ఏర్పాటు చేసిన బహి రంగ సభలో ప్రసంగించనున్నారు. 

రోల్‌మోడల్‌గా టీపీఎస్‌
ఆరుట్లలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉన్నత ప్రమాణాలతో విద్య అందిస్తారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమప్రాధాన్యం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందించనున్నారు. 

ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరగనుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్‌ మోడల్‌గా ఇది రూపుదిద్దుకుందని అంటున్నారు. మొదటి విడతలో ఆరుట్ల, మంచాల పాఠశాలతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. 

అప్పుడే నో అడ్మిషన్‌ బోర్డు
కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్‌ వాతా వరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్‌ హాల్స్‌తోపాటు ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు సంబంధించి ప్రత్యేక శిక్షకులనూ అందుబాటులో ఉంచారు. 

అదీగాక చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకు రావడానికి ప్రభుత్వం ఐదు బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఈ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తు న్నారు. ప్రస్తుతం 1,814 మంది విద్యార్థులు చదువుతుండగా, డిమాండ్‌ను తట్టుకోలేక నో అడ్మిషన్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్‌లో నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement