
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ డెవలప్‌మెంట్‌పై జూబ్లీహిల్స్ నివాసంలో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఏంఎఅండ్‌యూడీ సెక్రటరీ (హెచ్‌ఎండీఏ ఏరియా) ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జెఎండీపీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మూసీ రివర్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలన్న సీఎం.. వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్నారు.
గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్.. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను సీఎంకు అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.