నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు | CM Revanth Reddy Hands Over Appointment Letters to Group 1 Candidates | Sakshi
Sakshi News home page

నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు

Sep 28 2025 4:46 AM | Updated on Sep 28 2025 4:46 AM

CM Revanth Reddy Hands Over Appointment Letters to Group 1 Candidates

గ్రూప్‌–1 టాపర్‌ లక్ష్మీదీపికకు నియామకపత్రం అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులు

కాలం కలిసొచ్చి గెలిచినంత మాత్రాన కారణజన్ములు కాలేరు 

‘కొలువుల పండుగ’లో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం

పదేళ్లలో ఒక్క గ్రూప్‌–1 ఉద్యోగం కూడా భర్తీ చేయని బీఆర్‌ఎస్‌ 

వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారు 

మా ప్రభుత్వంలో 19 నెలల్లోనే 562 గ్రూప్‌–1 ఉద్యోగాలు భర్తీ  

గ్రూప్‌–1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత 

తల్లిదండ్రులను విస్మరిస్తే జీతం కోసి వారికి ఇస్తామని హెచ్చరిక 

తెలంగాణ మేధాశక్తిని ప్రపంచానికి చాటుదాం: భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: కాలం కలిసివచ్చి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కారణజన్ములు కాలేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుని దర్పంతో కారణజన్ములుగా తమకుతామే భావించారని బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాల్సినవారు తమ కుటుంబ సంక్షేమం, కుటుంబ సభ్యుల ఉపాధి మాత్రమే చూసుకున్నారని ఆరోపించారు.

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌.. ఒక్క గ్రూప్‌–1 ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల్లోనే ఏకంగా 562 గ్రూప్‌–1 ఉద్యోగాలు భర్తీచేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు శిల్పకళావేదికలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు.  

నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో నరేందర్‌రెడ్డి, కేశవరావు, జూపల్లి, పొంగులేటి, రామకృష్ణారావు, పొన్నం, శ్రీహరి, జితేందర్‌ తదితరులు 

తెలంగాణ ఇక్కడే ఉంది.. ఉంటది.. 
కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు నమ్మి అధికారాన్ని కట్టబెడితే నమ్మక ద్రోహం చేశారని బీఆర్‌ఎస్‌పై సీఎం మండిపడ్డారు. వాళ్లు ఇప్పుడు నమ్మక ద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ‘తెలంగాణ ఎక్కడుందంటూ కొందరు అప్పుడప్పుడు విమర్శిస్తున్నారు. వారికి నేను చెబుతున్నా... తెలంగాణ ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉంది.. ఇక్కడే ఉంటది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఏ పల్లెకు వెళ్లినా తెలంగాణ స్ఫూర్తి ఉట్టిపడుతుంది. యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్‌ రెడ్డి, యాదిరెడ్డిలాంటి వాళ్ల త్యాగాలను గత పాలకులు అపహాస్యం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అర్హత లేనివారిని పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌లో సభ్యులుగా నియమించారు.

సరైన జ్ఞానం లేనివారిని నియమిస్తే వారు రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసు ఉద్యోగులను ఎలా భర్తీ చేస్తారు. అందుకే అప్పట్లో ప్రశ్నపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో కనిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. పారదర్శకతతో పరీక్షలు నిర్వహించాం. కొంతమందికి అది నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని రేవంత్‌రెడ్డి రూ.2 కోట్లు, రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని సిగ్గులేకుండా ఆరోపణలు చేశారు.

అలాంటి వ్యాఖ్యలను నేను ఏమాత్రం పట్టించుకోకుండా మీ భవిష్యత్‌ కోసమే పోరాడా. నాడు అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు... నాకు నిరుద్యోగుల భవిష్యత్‌ మాత్రమే కనిపించింది. మీరంతా తెలంగాణ మోడల్‌. కోచింగ్‌ సెంటర్ల కుట్రను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏళ్ల తరబడి సెంటర్ల చుట్టూ తిరిగి ఇప్పుడు ఉద్యోగాలు అందుకుంటుంటే కొందరు రూ.లక్షలు ఫీజు ఇచ్చి కేసులు వేస్తున్నారు’అని విమర్శించారు  

జీడీపీలో మన వాటా పది శాతానికి పెంచుదాం 
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక నమూనాగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఎకానమీ రూ.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ధీమా వ్యక్తంచేశారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 నుంచి 10 శాతానికి పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని, అందరం కలిసి దేశానికి తెలంగాణ మోడల్‌ చూపిద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కొత్త గ్రూప్‌–1 అధికారులకు సూచించారు. ‘మీ భవిష్యత్‌ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏమాత్రం సహించబోము. నిర్దాక్షిణ్యంగా మీ జీతాల్లోంచి పది శాతం కోత పెట్టి వారి ఖాతాలో జమచేస్తాం. ఈ మేరకు త్వరలో చట్టాన్ని తీసుకువస్తాం’అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.  

రాష్ట్ర మేధాశక్తిని ప్రపంచానికి చాటుదాం: భట్టి
ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్లలో కూడా ఇంతపెద్ద సంఖ్యలో గ్రూప్‌–1 ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేయలేదని చెప్పారు. ఈ గ్రూపు–1 పరీక్షల్లో వ్యవసాయ కూలీ బిడ్డ మొదలుకొని, పంచర్లు వేసే కుటుంబానికి చెందిన బిడ్డలు కూడా ఉన్నతాధికారులుగా నియమితులు కావడం ఎంతో షంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 22,500 కోట్లతో లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదవారి కలలు నెరవేరుస్తోందని అన్నారు.

యువత మేధాశక్తిని ఉపయోగించుకోవటానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రపంచంతో పోటీపడే స్థాయికి యువత మేధాశక్తిని తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

అక్క, బావ ప్రోత్సాహంతోనే.. 
మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ కేన్సర్‌తో మృతి చెందింది. నాన్న వ్యవసాయానికి దూరమయ్యాడు. అన్నయ్య ఆటో నడిపిస్తున్నాడు. అక్క పుష్పలత, బావ వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి రాగలిగాను. 2017లో బీటెక్‌ పూర్తి చేశాను. 8 ఏళ్లుగా గ్రూప్‌–1 కోసం చదువుతున్నా. ఇప్పుడు 142వ ర్యాంకు వచ్చింది. డీఎస్పీగా ఉద్యోగం వచ్చింది. గతంలో పేపర్‌ లీకేజీల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇటీవల ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు మమ్మల్ని బాధించాయి. నా కుటుంబ నేపథ్యం చూస్తే ఉద్యోగం కొనటం సాధ్యమయ్యేదేనా? – ఆంజనేయులు, చోడంపల్లి, నార్కట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా

నా విజయం చూడకుండానే నాన్న చనిపోయారు 
చిన్నప్పటి నుంచి చదువులో నేను టాపర్‌నే. ఇంటర్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. జేఎ న్టీయూ హైదరాబాద్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించా. సివిల్స్‌ లక్ష్యంగా ప్రిపేర్‌ అయ్యాను. ఐదేళ్లు ఇంట్లోనే ఉండి సొంతంగానే చదువుకున్నాను. గ్రూప్స్‌–1లో 39వ ర్యాంకు సాధించాను. డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ వచ్చింది. నన్ను ఎంతగానో ప్రోత్సహించే మా నాన్న గత ఫిబ్రవరిలో చనిపోయారు. నా విజయం చూడకుండానే ఆయన దూరమైనందుకు బాధగా ఉంది. ఆయన లెగసీని పూర్తి చేసేందుకు సర్విస్‌లో డెడికేటెడ్‌గా పనిచేస్తాను. -మోక్షిత, ఇటిక్యాల, పుల్కల్‌ మండలం, సంగారెడ్డి జిల్లా.

నేను ఐఏఎస్‌ కావాలన్నది నాన్న కోరిక 
మా నాన్న సురేశ్‌ ఉపాధ్యాయుడు. నేను ఐఏఎస్‌ కావాలన్నది ఆయన కోరిక. ఆయనే నా ఇన్‌స్పిరేషన్‌. బీఏ పూర్తి చేశాక యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాను. ప్రిలిమ్స్‌ 3 సార్లు రాశా. గ్రూప్‌–1లో 270 ర్యాంకు వచ్చింది. ఈ మధ్య మాపై వచ్చిన ఆరోపణలు బాధించాయి. అందరూ నిజాయితీగా ఉద్యోగాలు సాధించారు. ఎట్టకేలకు అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. – గడ్డం నాగవైష్ణవి, భూపాలపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement