మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ | Congress Leader Sridhar Babu Comments On BJP, BRS | Sakshi
Sakshi News home page

మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ

Nov 1 2025 11:37 PM | Updated on Nov 1 2025 11:37 PM

Congress Leader Sridhar Babu Comments On BJP, BRS

ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే సీఎం వ్యాఖ్యల వక్రీకరణ

ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు... ఆగదు కూడా

ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ డైవర్షన్ డ్రామా

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. 

అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. 

ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. 

ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్‌ఎస్‌ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement