బైబై గణేశా..! | CM Revanth Reddy In Ganesh Nimajjanam | Sakshi
Sakshi News home page

బైబై గణేశా..!

Sep 7 2025 8:47 AM | Updated on Sep 7 2025 8:47 AM

CM Revanth Reddy In Ganesh Nimajjanam

కన్నుల పండువగా  సాగిన  వేడుకలు

నిమజ్జనాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 

హోరెత్తిన యువత ఉవ్వెత్తున కేరింత

జనసంద్రమైన సాగరతీరం  కిక్కిరిసిన మెట్రో రైళ్లు  

నిమజ్జనోత్సాహం వెల్లువెత్తింది. హైదరాబాద్‌ మహానగరం గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగింది. ఆబాలగోపాలమంతా వినాయకసాగర్‌ బాటపట్టింది. తొమ్మిది రోజులపాటు వివిధ ప్రాంతాల్లో ఘనమైన పూజలందుకున్న గణనాథుడు జనసంద్రమై తరలివచి్చన భక్తకోటి ఆనందోత్సాహాల నడుమ గంగమ్మ ఒడికి చేరాడు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఉదయం నుంచే నగరం ఆధ్యాతి్మక శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విగ్రహాలు, ఆటపాటలు, నృత్యప్రదర్శనలతో శోభాయమానమైంది. ఉదయమే బయలుదేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ముగిశాయి. 69 అడుగుల గణనాథుడి విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పరిపూర్ణమైన నిమజ్జనాన్ని కనులారా వీక్షించిన భక్తులు గొప్ప అదృష్టంగా భావించారు. వేలాదిమంది ఆ దృశ్యాన్ని తమ మొబైల్‌ఫోన్‌లలో బంధించారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌ మహాజన సాగరమైంది.  

పోటెత్తిన భక్తజనం... 
నిమజ్జనోత్సవాలకు తరలి వచ్చిన భారీ భక్తజనసందోహంతో రహదారులు పోటెత్తాయి. ఖైరతాబాద్‌ విగ్రహం నిమజ్జనం తరువాత  భక్తులు కొద్దిగా తగ్గుముఖం పట్టారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. బాలాపూర్‌ వినాయకుడి విగ్రహంతోపాటు నగరం నలువైపుల నుంచి తరలివచి్చన విగ్రహాల నిమజ్జన వేడుకలు అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగాయి. దీంతో ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్డు, అంబేడ్కర్‌ విగ్రహం, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాలు భారీగా తరలివచి్చన భక్తజనులతో కిటకిలాడాయి. యువత పెద్ద సంఖ్యలో తరలిచి్చంది. ‘జై బోలో గణపతి మహారాజ్‌కీ ’నినాదాలతో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ పరిసరాలు హోరెత్తాయి.  

మెట్రో కిటకిట..... 
నిమజ్జనం సందర్భంగా మెట్రో రైళ్లు భక్తులతో కిక్కిరిశాయి. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడింది. నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తుల రద్దీతో ఖైరతాబాద్‌ స్టేషన్‌లో ప్రయాణికుల ఎగ్జిట్, ఎంట్రీ గేట్‌లు సైతం స్తంభించాయి. మియాపూర్, ఎల్‌బీనగర్‌ మార్గాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. నాగోల్, అమీర్‌పేట్, రాయదుర్గం ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడి దృష్ట్యా ఖైరతాబాద్‌ వద్ద కొద్దిసేపు ప్రవేశద్వారాలను మూసి ఉంచారు.  

సోషల్‌ మీడియాలో గణేశుడి హవా  
వినాయక నిమజ్జన వేడుకలను ఇళ్లళ్లో టీవీల ముందు ఎంత మంది చూశారో.. అంతకు రెట్టింపు జనాలు సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యారు. ట్యాంక్‌బండ్‌లో గణేశ్‌ నిమజ్జన సరిళిని హైదరాబాద్‌ సిటీ పోలీస్, సరూర్‌నగర్‌ ట్యాంక్‌ రాచకొండ పోలీసులు, ఐడీఎల్‌ చెరువు, హస్మత్‌పేట చెరువులలో జరుగుతున్న నిమజ్జనాల సన్నివేశాలను సైబరాబాద్‌ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేశారు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్‌ వినాయక నిమజ్జనాలు సాగుతున్న తీరును, ప్రయాణ మార్గం, జన సందోహం, పూజలు తదితర ఏర్పాట్ల గురించి పోలీసులు నిరంతరం పోస్ట్‌లు పెట్టారు. వినూత్న రీతిలో, విభిన్నంగా ఉన్న గణేష్‌ ప్రతిమలను షేర్‌ చేశారు. ప్రత్యేకంగా ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జనం, బాలాపూర్‌ లడ్డూ వేలం సరళిని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేశారు. 
 
సమాచారం అందిస్తూ... 
వినాయక నిమజ్జనం వేడుకలతోపాటు ప్రయాణ మార్గాలు, రోడ్‌ మళ్లింపులు, పార్కింగ్‌ ప్లేస్‌లు, అత్యవసర ఫోన్‌ నంబర్లు, ఇతరత్రా సమాచారాన్ని  సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు అన్ని పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పోలీసులు ప్రత్యేకంగా కటౌట్లను తయారు చేసి పోస్ట్‌ చేశారు. ‘భగవంతుడి కళ్లు ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి. అలాగే మా సీసీటీవీ కెమెరాలు కూడా గమనిస్తూ ఉంటాయి’అనే తెలుగు, ఇంగ్లి‹Ù, హిందీ మూడు భాషల్లో స్లోగన్‌తో షీ టీమ్‌ పోస్ట్‌లతో అప్రమత్తం చేశారు. పోలీసుల పోస్ట్‌లను గమనించిన ఫాలోవర్స్‌ పోలీస్‌ డ్రెస్‌తో వినాయక ఫొటోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు.  

డీజేల హోరు.. భక్తుల జోరు..  
గ్రేటర్‌లో వినాయకుడు మోత మోగించేశాడు. నిమజ్జనం వేళ డీజీలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్‌ వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్దరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాలలో ఫిర్యాదు చేసినా పీసీపీ, మున్సి పల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హుస్సేన్‌సాగర్, అబిడ్స్, బహదూర్‌పుర, చారి్మనార్, ఖైరతాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌ వంటి ప్రాంతాలలో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది.  

శబ్ద కాలుష్యంపై నిర్లక్ష్యం
పుణే, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్‌ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర  ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రశాంతంగా సామూహిక ఊరేగింపులు  
గణేష్‌ ఉత్సవాల్లో తుది, కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం ప్రారంభమైంది. నగర పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్‌లో టీజీఐసీసీసీ నుంచి ఈ శోభాయాత్రను ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. సామూహిక నిమజ్జన క్రతువు ఆదివారం ఉదయానికి   పూర్తయ్యే అవకాశం ఉంది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఈ కీలక ఘట్టం అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా సాగు తోంది. నగరంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. ఆయా మార్గాల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా కెమెరాలు ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరిగే రూట్‌లో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటూ సీసీ, పీటీజెడ్, వైఫై వంటి ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు అన్నింటినీ ఐసీసీసీలో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించింది. ఐసీసీసీలో ఉన్న మల్టీ ఏజెన్సీ ఆపరేషనల్‌ సెంటర్‌ను సమర్థంగా వినియోగించారు. ఇక్కడే ఉన్న పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌ సహా అన్ని విభాగాల అధికారులు హుస్సేన్‌సాగర్, ఎంజే మార్కెట్, చారి్మనార్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఊరేగింపులు పర్యవేక్షించారు.  

నగర సీపీ పర్యవేక్షణ
సిటీ సీపీ ఆనంద్, అదనపు సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఏఏ చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయిందే తక్షణం గుర్తిస్తూ విద్యుత్‌ అధికారులకు తెలిపి తక్షణం పునరుద్ధరించే ఏర్పాట్లు చేశారు.  హుస్సేన్‌సాగర్‌ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు చాంద్రాయణగుట్ట–నాగుల్‌చింత చౌరస్తా, ఇంజన్‌»ౌలి–ఎంజే మార్కెట్, కట్టమైసమ్మ–ఫలక్‌నుమ, ఇంజన్‌»ౌలి–మదీన, మదీన–నిజాం కాలేజీ మధ్య ఉన్న ప్రాంతాలపై తొమ్మిది డ్రోన్లు వినియోగించిన పోలీసు విభాగం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని గుర్తించి ఐసీసీసీ నుంచి పరిష్కారాలను సూచించింది.  

2.54 లక్షల చిన్న విగ్రహాల నిమజ్జనం
జీహెచ్‌ఎంసీలోని పైస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా అందరూ తగిన జాగ్రత్తలతో, సమన్వయంతో పనులు చేయడంతో నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాల నిర్వహణతోపాటు ఐదువేల మందికి ఉచితంగా భోజనాలు అందజేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. హుస్సేన్‌ సాగర్‌లో పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా, ఐదడుగుల లోపు చిన్న విగ్రహాలను తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనాలు చేశారు. ఇలాంటి విగ్రహాలు శనివారం రాత్రి 8 గంటల వరకు 2,54,685 నిమజ్జనమైనట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి.

నిర్విఘ్నం.. సంపూర్ణం..
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనం నిర్విఘ్నంగా... సంపూర్తంగా సాగర్‌లో నిమజ్జనం గావించారు. నవరాత్రులు 69 అడుగుల ఎత్తులో విశేష పూజలందుకున్న ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ఘట్టం 6 గంటల్లో పూర్తిచేశారు. శనివారం ఉదయం 7.41 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర సాగర తీరానికి చేరుకొని ఎనీ్టఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం 4 వద్ద 1.45 నిమిషాలకు సంపూర్ణంగా నిమజ్జనం ముగిసింది.  

15 రోజుల ప్రణాళిక  
మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు సైఫాబాద్‌ ఏసీపీ సంజయ్‌కుమార్, హెచ్‌ఎండీఏ అధికారి గణేష్‌ జాదవ్‌ నిమజ్జన ప్రాంతంలో 70 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్లకుపైగా లోతు ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేసి ఆ ప్రాంతంలో రెడ్‌ఫ్లాగ్‌ ఏర్పాటు చేసి మార్కింగ్‌ చేశారు. మహాగణపతి లిఫ్ట్‌ చేసినప్పటి నుంచి సూపర్‌ క్రేన్‌ ఆపరేటర్‌ అజయ్‌ శర్మకు ఖచి్చతమైన సూచనలు చేస్తూ సంపూర్ణంగా నిమజ్జనం అయ్యేలా చూశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement