భారమైతే బదిలీ! | Sakshi
Sakshi News home page

భారమైతే బదిలీ!

Published Mon, Dec 25 2023 4:07 AM

CM Revanth Reddy with District Collectors and SPs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్‌ మైండ్‌తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్‌లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్‌ చెప్పారు. 

ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు 
ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.

నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్‌కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్‌ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్‌ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. 

అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? 
‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్‌ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్‌ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. 

ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి 
‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. 
తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్‌ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్‌ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్‌) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. 

పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది
డిప్యూటీ సీఎం భట్టి 
కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్‌సెట్‌ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.   

 
Advertisement
 
Advertisement