ఖర్గేకు స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్, మహేశ్‌గౌడ్, మీనాక్షీ నటరాజన్ తదితరులు
గుల్బర్గా వెళ్తూ హైదరాబాద్‌లో ఆగిన ఏఐసీసీ అధ్యక్షుడు
సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ తదితరులతో అల్పాహార విందు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్న ఆయన కొద్దిసేపు హైదరాబాద్‌లో ఆగారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో ఖర్గే ప్రత్యేకంగా సమావేశమయ్యారని, ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) వివరాలతో పాటు రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఖర్గేకు మహేశ్‌గౌడ్ వివరించారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి.


