సీనియర్‌ మహిళా ఐపీఎస్‌తో విచారణ | CM Revanth Comments On Bandi Sanjay Son Case in a chat with media | Sakshi
Sakshi News home page

సీనియర్‌ మహిళా ఐపీఎస్‌తో విచారణ

May 12 2026 5:54 AM | Updated on May 12 2026 11:50 AM

CM Revanth Comments On Bandi Sanjay Son Case in a chat with media

బండి సంజయ్‌ కుమారుడిపై కేసులో దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్‌ బాలిక తల్లి పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్‌ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్‌ కుమారుడు కరీంనగర్‌లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. 

బీఆర్‌ఎస్‌ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్‌మెంట్‌ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్‌ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్‌ కమిషనర్‌కు ఇవ్వొచ్చని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement