Mallanna Sagar Reservoir: మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR Inaugurates Mallanna Sagar Reservoir Siddipet District Highlights - Sakshi

సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసి మల్లన్న సాగర్‌ను జాతికి అంకితం చేశారు. 50 టీఎంసీలతో నిర్మించిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందించనున్నారు.

2018లో మొదలు 
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2018లో రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–4లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్నా రీ డిజైన్‌ చేసి 50 టీఎంసీలకు పెంచారు. రూ.6,805 కోట్ల బడ్జెట్‌తో మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం 17,781 ఎకరాల భూమిని సేకరించారు. 8 పంచాయతీలతోపాటు మొత్తం 14 నివాస ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి.

10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున 5 అంచెల్లో 557 మీటర్ల ఎత్తు వరకు కట్టారు. 143 మీటర్ల పొడవున మత్తడి ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌కు చేరిన గోదావరి జలాలను బాహుబలి మోటార్ల ద్వారా ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు కూడా దీని ద్వారానే నీటిని పంపుతారు. దీంతో తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా మల్లన్నసాగర్‌పైనే ఆధారపడి ఉంది. మొత్తంగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌తో మేలు జరగనుంది.

ప్రస్తుతం 10 టీఎంసీలు నిల్వ 
అతిపెద్ద ఎత్తిపోతల పథకం కావడంతో రిజర్వాయర్‌ను ఒకేసారి పూర్తిస్థాయిలో నింపకుండా విడతల వారీగా ఒక్కోస్థాయి వరకు నింపుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 60 మీటర్ల ఎత్తైన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తుందో నీటిరంగ నిపుణులు ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  

హైదరాబాద్, సికింద్రాబాద్‌ల కోసం 30 టీఎంసీలు 
వ్యవసాయ అవసరాలతో పాటు  హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. ఈ రిజర్వాయర్‌‌లో నీరు ఉంటే వేసవిలోనూ అన్ని అవసరాలకు ఉపయోగపడనుంది. అందుకే మిడ్‌మానేరు నుంచి అన్నాపూర్‌, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల మీదుగా ఎత్తిపోతలతోపాటు అదనపు టీఎంసీ కాలువకు సైతం శ్రీకారం చుట్టారు. వానాకాలంలో రోజుకు 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, దీని పరిధిలోని రిజర్వాయర్లకు తరలిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top