చిక్కుముడులు వీడినట్టే! | Sakshi
Sakshi News home page

చిక్కుముడులు వీడినట్టే!

Published Fri, Jan 1 2021 2:51 AM

CM KCR To Hold Review Meeting On Dharani - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల విషయంలో మూడు కీలక సమస్యల ముడి వీడిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. గురువారం ప్రగతిభవన్‌లో పలు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ధరణి పోర్టల్‌లోని సమస్యలపై సమావేశం నిర్వహించారు. అనంతరం.. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో మ్యుటేషన్, పార్ట్‌–బీ, సాదాబైనామాల ద్వారా క్రయ విక్రయా లు జరిగిన భూముల సమస్య పరిష్కారమైనట్టేనని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో జరిగిన సమావేశంలో భాగంగా సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డిలు 19 అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారని, వారు చెప్పిన అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ భూముల విషయంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇటు ఈ సమావేశం మూడున్నర గంటలకుపైగా జరగడం గమనార్హం.  చదవండి: (సీఎం కేసీఆర్ మరో‌ సంచలన నిర్ణయం)

మ్యుటేషన్‌ సమస్యలకు మోక్షం.. 
గతంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు ఆ భూముల మ్యుటేషన్లను తహసీల్దార్లు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను తహసీల్దార్లే చేసేందుకు వీలుగా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు.  కొత్త పద్ధతిలో ప్రారంభమైన తర్వాత కూడా పాత పద్ధతిలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భూముల మ్యుటేషన్‌ను కొత్త పోర్టల్‌ అనుమతించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు సం బంధించిన మ్యుటేషన్లు 4 నెలల నుంచి పెండింగ్‌లో పడ్డాయి. ఇప్పుడు వీటిని పరిష్కరించేందుకు అనుమతినివ్వడం తో వీలున్నంత త్వరలోనే ఈ భూముల మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది. పార్ట్‌–బీలో చేర్చిన భూములు 16 లక్షల ఎకరాలకుపైగా ఉన్నాయి. చదవండి: (2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..)

ఇప్పుడు కోర్టు కేసుల్లో ఉన్నవి మినహా అన్నింటినీ పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇందుకు ఆరు నెలల సమయం ఇచ్చారు. ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్‌.టి.ఎల్, దేవాదాయ, వక్ఫ్, అటవీ భూ ములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్‌ చేయవద్దని సీఎం ఆదేశించిన నేపథ్యంలో పార్ట్‌–బీలో పెట్టిన ఆ భూముల సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో సరిహద్దు వివాదాలు, వారసత్వ పంచాయతీలు, ఇతర సమస్యలుండి కోర్టులకు వెళ్లని భూములకు సంబంధించి 1.25 లక్షల ఎకరాల్లో సమస్య ఉందని, ఇందులో 70 వేల ఎకరాలకు ఇప్పటికే పాసు పుస్తకాలు ఇచ్చామని, మిగిలిన 45 వేల ఎకరాలకు త్వరలో మోక్షం కలుగుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 22 (ఏ) జాబితాలోని కొన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులభూములు కూడా ఉన్నాయి. వీటికి ఏండ్ల తరబడి రిజిస్ట్రేషన్లు జరగ డం లేదు. ఈ నేపథ్యంలో ఆ  భూములను గుర్తించి యాజమాన్య హక్కులు ఖరారు చేయాలని సీఎం ఆదేశించడంతో వేలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్న రైతులకు ఊరట కలగనుంది. 

9 లక్షలకు పైగానే..
రాష్ట్రం ఏర్పాటైన నాటికి తెల్లకాగితాత లు, ఇతర ఒప్పందాల ద్వారా చేతులు మారిన సాదాబైనామాల భూముల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించి వాటికి కొనుగోలుదారుల పేరిట పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. కానీ, ఇప్పటివరకు వాటి విషయంలో పురోగతి లేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కూడా ఆ సమస్య పరిష్కారం కాక కబ్జాలో ఉన్న, సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పుడు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఊరట కలగనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలని సీఎం కేసీఆర్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతో త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సీసీఎల్‌ఏ వర్గాలు చెబుతున్నాయి.  

Advertisement
Advertisement