అలంకారప్రాయంగా బడ్జెట్ సమావేశాలు

CLP Leader Mallu Bhatti Vikramarka Comments On CM KCR - Sakshi

పక్కదారి పడుతున్న సబ్ ప్లాన్ నిధులు

బడ్జెట్ సమావేశాలకు ఆరు రోజులా?

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్: దాదాపు 30 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం ఆరు రోజుల్లోనే ముగించడంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 ఏడాదికి సంబంధించిన 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన  భారీ బడ్జెట్‌ను కేవలం ఆరు రోజులకు మాత్రమే చర్చలను పరిమితం చేసి.. పాస్ చేయించుకుని వెళ్లిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం.. శాసనసభా సమావేశాలు ముగిసిన అనంతరం గన్ పార్క్‌లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు 30 రోజులు జరపవలసిన బడ్జెట్ సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడంపై ఆయన మండిపడ్డారు.  భారీ బడ్జెట్ పైనా సుదీర్ఘంగా చర్చలు జరిపి.. పాస్ చేసుకోవాల్సి ఉండగా, కేవలం ఆరు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఆరు రోజుల్లో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలను అధికార పక్షం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బడ్జెట్‌ను అధికార పక్షం పాస్ చేయించుకున్న వైనం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. కేసీఆర్ పాలన నియంతృత్వ పాలనలా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలా లేదన్నారు, శాసనసభా సమావేశాలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయి తప్ప... అర్థవంతమైన చర్చలు జరగడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగం, నీటిపారుదల, క్రుష్ణానదిమీద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని భట్టి చెప్పారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో టెండర్లలో అక్రమాలకు పాల్పడి.. భారీ అవినీతికి పాల్పడినట్లు భట్టి ఆరోపించారు. ఇది రాష్ట్రం మీద అదనపు ఆర్థిక భారంలా మారిందని బట్టి అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ ప్రజల సమక్షంలో పెట్టడంతో పాటు చట్టసభలలో పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. డీపీఆర్‌లను చట్టసభల్లో ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదన్నారు. అప్పులను ప్రభుత్వం విపరీతంగా చేస్తోందన్నారు.

ఈ ఏడాది రూ. 48 వేల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ అప్పులు ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా.. చిరవకు రాష్ట్రాన్ని డెడ్ ట్రాప్ లోకి నెట్టేస్తున్నారన్నారు. 2023 నాటికల్లా అప్పులు ఐదున్నర నుంచి 6 లక్షల కోట్ల రూపాయాలకు రాష్ట్ర అప్పులు చేరుకుంటాయని వివరించారు. రాష్ట్రాన్ని కుదవపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను వినియోగించకుండా.. వాటిని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శుల అంశాలపై కాంగ్రెస్ శాసనసభా పక్షం.. సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top