రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్. చిత్రంలో వీహెచ్, పొన్నం, అనిల్, గీతారెడ్డి, అంజన్ కుమార్ తదితరులు
మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు?
ప్రవీణ్‌కుమార్ ఐవోలాగా విచారణ చేసిండు... కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్
బండి భగీరథ్ అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు చిక్కినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘పోక్సో కేసులో ఫిర్యాదు రాగానే ఎఫ్‌ఐఆర్ చేయాలి. జీరో ఎఫ్‌ఐఆర్ చేసి పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద స్టేట్‌మెంట్ ఇప్పించాం. మా చర్యలను ప్రజలు గానీ, కోర్టులు గానీ తప్పుబట్టలేదు. పోక్సో కేసు వివరాలు చెప్పకూడదు. కానీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దర్యాప్తు అధికారి (ఐఓ) లాగా విచారణ చేసిండు. కేటీఆర్ జడ్జీలాగా శిక్ష వేసిండు.
వారిలాగా రోడ్లపై పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది? ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టారు (సోషల్ మీడియాలో). రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు? ఒక మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఏదో సాధించినట్టు ఈ శాడిజం ఏమిటి? ఇది శాడిస్టిక్ ఆనందం కాదా?..’అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా?
‘అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడానికి ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కరీంనగర్‌లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో అమ్మాయి మేజర్ అనే వివాదానికి తెరలేపారు. అమ్మాయి మైనరా? మేజరా? అనే ప్రభుత్వ రికార్డులు సేకరించాం. అమ్మాయి ఏజ్ ఎంత అని ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీనా? ప్రవీణ్‌కుమార్ ఐఓనా? ఐఓ వెళ్లి స్కూల్‌లో ఆమె బర్త్ సర్టిఫికెట్, టెన్త్ సర్టిఫికెట్, హాస్పిటల్‌లో బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకుని మైనర్ అని తక్షణమే నిర్ధారించారు.
ప్రవీణ్‌కుమార్‌కు ఉద్యోగం లేదు..
ప్రధాని పర్యటన ఉన్నప్పుడు వారి (బండి సంజయ్) ఇంటిపైకి వెయ్యి మంది పోలీసులను పంపితే తమ పార్టీ (బీజేపీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిందని, తెలంగాణలో గెలుస్తుందని, దీనితో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన చెçప్పుకుంటాడు. సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించాం. ఎక్కడైనా సెక్షన్లలో, అరెస్టులో, రిమాండ్‌లో, కోర్టులో వాదనల్లో లోపం ఉందా? కేటీఆర్, బండి సంజయ్‌కి ఏదో పంచాయితీ ఉంది. ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటున్నడు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉద్యోగం లేక గాలికి తిరుగుతూ నేనే విచారణాధికారి అనే భ్రమల్లో ఉన్నడు.’అని సీఎం ధ్వజమెత్తారు.
కేటీఆర్ బావమరిదికి ఇంకో న్యాయమా?
‘కేటీఆర్ బావమరిదికి కూడా డ్రగ్స్ కేసులో విచారణకు నోటీసులు ఇచ్చాం. పోక్సో కేసులో బండి భగీరథ్‌కి నోటీసులు ఇచ్చాం. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుని తన బావమరిది దొరికితే అతడిని వంగబెట్టి గొట్టండి..కోదండం ఎక్కించండి అని కేటీఆర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎందుకు చెప్పలేదు. మా బామ్మర్ది దీపావళి పండుగ చేసుకుంటున్నడు. చిచ్చుబుడ్లకు బదులు సారాయి బూత్ పెట్టుకున్నడు. బంతిపూలకి బదులు గంజాయి పూలు లేకపోతే కొకైన్ పెట్టుకున్నడు.
మీరు ఎట్ల అరెస్ట్ చేస్తరు అని బయటకి వచ్చి మాట్లాడిండు కదా. బామ్మర్ది డ్రగ్స్‌తో ఫామ్‌హౌస్‌లో పట్టుబడితే కేసు కాదట. ఇంకో ఎమ్మెల్సీ కోడిపందాల్లో దొరికితే కేసు లేదట. దుబాయ్‌లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు..ఆర్థిక లావాదేవీలు, వాళ్ల ఎక్స్ ఎమ్మెల్యే గురించి ఇవాళ చెప్తున్న. వాళ్ల ఫామ్‌హౌస్‌లో పోలీసులపై కాల్పులు జరిపి (ఓ వ్యాపారి) డ్రగ్స్‌తో దొరికిండు. మరి ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ యాడ పండుకుండు? ఎందుకు పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయలేదు ? వాడికి నోటీసు ఇవ్వలేదు. నీతులు చెప్పడానికే ఉన్నయా?.
కేసీఆర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదు?
‘కేటీఆర్ ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదు? మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేత యాడ నిద్రపోతుండు? బయటకి వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకుంటే ప్రెస్‌నోట్ అయినా ఇవ్వొచ్చు కదా? పక్క పార్టీ వాడు పార్టీలోకి వస్తే జగిత్యాల పోయివస్తడు. ఇంత మేజర్ ఘటన రాష్ట్రంలో జరిగితే ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయిండు? ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలి కదా. అధికారం ఉంటనే బయటకి వస్తావా?..’అని రేవంత్ ప్రశ్నించారు.
మా పోలీసులు చెప్పిందే నమ్ముతా..
‘బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతా. పిల్లవాడిని వారి ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి సరెండర్ చేయాలి. రోడ్డుపై నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ వద్ద పోలీసులకు బండి భగీరథ్ చిక్కిండు. రోడ్డు మధ్యలో పోలీసులు కస్టడీలో తీసుకుంటే సరెండర్ చేశామని చెప్పే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా? పోలీసుల మాటలా? బండి సంజయ్ దగ్గరుండే పంపించవచ్చు. ఐదు రోజులు పరారీలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా? లేరా?..’అని సీఎం నిలదీశారు.
రైతు ఆత్మహత్యపై విచారణకు ఆదేశం
మెదక్‌లో రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబానికి గతంలో కొల్లగొట్టిన ధనం నుంచి రూ.2 లక్షలో రూ.5 లక్షలో ఇస్తారనుకుంటే శవం చూసి పళ్లు ఇకిలిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు.
కొంతమంది బీఆర్‌ఎస్ అనుకూల మిల్లర్లు ఉన్నారని, వారి మిల్లులకు లారీల్లో ధాన్యం పంపితే దించనీయకుండా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శవాల మీద పేలాలు ఏరడం ఏమిటి? అని ప్రశ్నించారు. కులగణనను సుప్రీంకోర్టు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో మోదీ సర్కార్ కుయుక్తులు
ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో మళ్లీ ఆ బిల్లు పెట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి
లక్డీకాపూల్(హైదరాబాద్): మహిళా రిజర్వేషన్ల బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు మహిళా బిల్లుకు డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సచివాలయం వద్ద ఉన్న విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. రాజీవ్‌గాంధీ సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనికుడన్నారు. రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. సోనియాగాంధీ సాహసోపేత నిర్ణ యంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఎంపీ అనిల్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.


