వికారాబాద్: హైదరాబాద్‌లో విధులకు హాజరయ్యేందుకు పరిగి నుంచి ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లు ముగ్గురు ఉదయం 6 గంటల ప్రాంతంలో బయలు దేరారు. ప్రమాదానికి గురైన బస్సు వెనుక మరో బస్సులో వీరు ఉన్నారు. ముందు వెళుతున్న బస్సు ప్రమాధానికి గురైన ఐదు నిమిషాల్లో వీరి బస్సు కూడా అక్కడకు చేరుకుంది. వెంటనే ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు దీపశ్రీ, వనజ, పద్మలతోపాటు మరో ఏడుగురు కానిస్టేబుళ్లు సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించారు. 11 మందికి సీపీఆర్ చేశారు. క్షతగాత్రులు కొంచెం తేరుకున్నట్టు కనిపించగానే ఆస్పత్రులకు తరలించారు.
గాయాలను సైతం లెక్క చేయకుండా.. 
బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో పోలీసులు, 108 ఉద్యోగులు గాయాలను సైతం లెక్క చేయకుండా సేవలందించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో నిమగ్నమయ్యారు. చేవెళ్ల, వికారాబాద్, పరిగి సబ్ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వాహనాలను దారి మళ్లించారు. బస్సులోంచి మృతదేహాలను కిందకు దించడంతో పాటు వెనువెంటనే అంబులెన్సులు, ఆయా వాహనాల్లో వికారాబాద్, చేవెళ్ల ఆస్పత్రులకు తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు వెల్డింగ్ కట్టర్స్ వినియోగించి బస్సులోని రాడ్లు, సీట్లను తొలగించటంలో ఫైర్ అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో చేవెళ్ల సీఐ, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
