భాగ్యనగరంలో మింట్‌ మ్యూజియం..దేశంలోనే తొలిసారిగా..!

Cash Printing Press Machine Will Be Available In Hyderabad Soon - Sakshi

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు 

సైఫాబాద్‌ నగదు ముద్రణాలయంలో వందేళ్లనాటి యంత్రాలను బాగుచేస్తున్న అధికారులు 

వచ్చేనెల రెండోవారం ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’ వేడుకల్లో ఎగ్జిబిషన్‌ 

తర్వాత పూర్తిస్థాయి మ్యూజియం ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: నాణేలు ఎలా తయారవుతాయి.. నోట్ల ముద్రణ ఎలా జరుగుతుంది.. ఆ యంత్రాలెలా ఉంటాయి.. ఈ విషయాలు అందరికీ ఆసక్తికరమే. మరి నోట్ల ముద్రణను స్వయంగా చూడగలిగితే.. బాగుంటుంది కదా.. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ అవకాశం కలగనుంది. మన దేశంలో ప్రస్తుతం నోట్లు, నాణేలు ముద్రించే కీలక మింట్‌లలో ఒకటి చర్లపల్లిలో ఉన్న హైదరాబాద్‌ మింట్‌. దానికన్నా ముందు నిజాం హయాంలోనే హైదరాబాద్‌లో నోట్లు ముద్రించిన మింట్‌ సైఫాబాద్‌లో నేటికీ పదిలంగా నిలిచి ఉంది.

వందేళ్ల కంటే పూర్వం నాటి యంత్రాలతో కూడిన ఆ భవనంలోనే ‘మింట్‌ మ్యూజియం’ ఏర్పాటు కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌పీఎంసీఐఎల్‌)’ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’లో భాగంగా వచ్చేనెల రెండో వారంలో సైఫాబాద్‌ మింట్‌ భవనంలో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు. తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చే పని ప్రారంభం కానుంది.

ఇక్కడి పురాతన యంత్రాలను పునరుద్ధరించే కసరత్తు మొదలుపెట్టారు. తొలుత ఎగ్జిబిషన్‌ కోసం ‘ఇంటాక్‌’ హైదరాబాద్‌ చాప్టర్‌ సహకారంతో పనులు మొదలయ్యాయి. వందేళ్లకు పైబడి కరెన్సీని ముద్రించిన మింట్‌ను మ్యూజియంగా మార్చుతుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

నిజాం హయాంలో.. 
స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజులు సొంతంగా నాణాలు ముద్రించుకోవడం కోసం మింట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడో నిజాం నవాబ్‌ సికిందర్‌జా 1803లో రాయల్‌ మింట్‌కు ఆర్డర్‌ ఇచ్చాడు. సుల్తాన్‌షాహీలో ఉన్న రాయల్‌ ప్యాలెస్‌లో ఏర్పాటైన ఆ మింట్‌లో.. నిజాం సంస్థానం సొంత నాణేలు తయారయ్యేవి. వాటిని చేతితో రూపొందించేవారు. 1857 తొలి స్వాతంత్య్ర పోరాటం తర్వాత దేశంలోని కొన్ని ముఖ్యమైన మింట్లు మినహా మిగతావాటిని బ్రిటిష్‌ ప్రభుత్వం మూసేసింది.

ముంబై, కోల్‌కతాల్లో రెండు ఆధునిక మింట్లను ఏర్పాటు చేసింది. వాటిలో పూర్తిగా యంత్రాలతో నాణేలు, నోట్లు ముద్రించేవారు. ఆరో నిజాం తమ మింట్‌లో కూడా యంత్రాలతో ముద్రణ జరగాలని భావించి.. 1895లో లండన్‌ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. వాటితో చర్కి (చర్కా) నాణేల ముద్రణ మొదలైంది.

పూర్తిస్థాయిలో ఆధునీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్‌ మింట్‌ల తరహాలో పూర్తి ఆధునిక పద్ధతుల్లో నాణేలు ముద్రించే కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 1918లో హైదరాబాద్‌ కరెన్సీ చట్టాన్ని తెచ్చి.. నోట్ల ముద్రణ కూడా ప్రారంభించారు. నాణేలతోపాటు రూ.1,000, రూ.100, రూ.10, రూ.5 పేపర్‌ కరెన్సీని, స్టాంపు పేపర్లను కూడా ముద్రించారు. తర్వాత మెడల్స్, బ్యాడ్జెస్, ఇతర జ్ఞాపికలు కూడా రూపొందించేవారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top