
గాంధీఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్
ఎంఎంటీఎస్ ఘటనపై విచారణ వేగవంతం చేయాలి: కేటీఆర్
మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్‌గౌడ్
నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.