గన్‌పార్కు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం గన్‌పార్కులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో.. పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, బీసీలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించాలని, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
గన్‌పార్కు నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు చూపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతీ వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను మోసగించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు సమాధి చేయడం ఖాయమని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.


