ఒక్క క్లిక్‌తో సమస్త భూసమాచారం | Integrated Bhoobharathi portal to launch in 5 Mandals from April 2: Ponguleti Srinivas Reddy | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో సమస్త భూసమాచారం

Mar 27 2026 4:56 AM | Updated on Mar 27 2026 4:56 AM

Integrated Bhoobharathi portal to launch in 5 Mandals from April 2: Ponguleti Srinivas Reddy

2 నుంచి సమీకృత భూభారతి షురూ 

సర్వే నుంచి రిజిస్ట్రేషన్‌ వివరాల వరకు అన్నీ ఒకే గొడుగు కిందకు

తొలుత ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు 

ఫలితాలను బట్టి మార్పులు, చేర్పులతో రాష్ట్రమంతటా.. 

ప్రతి సర్వే నంబర్‌కు భూధార్‌ నంబర్‌ 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర రైతాంగానికి అత్యంత పారదర్శక, సులభతర సేవలందించడమే లక్ష్యంగా రూపొందించిన సమీకృత భూభారతి పోర్టల్‌ (ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)ను ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తొలుత ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభిస్తామని, ఫలితాలను బట్టి మార్పులు, చేర్పులు చేసి రెండోదశలో రాష్ట్రమంతటా అమలు చేస్తామని తెలిపారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో రెవెన్యూ, సర్వే, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు.  

వేగవంతంగా భూపరిపాలన సేవలు 
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో పాలన సాగుతోందని పొంగులేటి చెప్పారు. భూపరిపాలన సేవలను వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు వచ్చేలా భూభారతి పోర్టల్‌ను అప్‌డేట్‌ చేశామని, ప్రతి భూలావాదేవీ వివరాలు కనిపించేలా ఈ పోర్టల్‌ను ఆధునీకరించామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన మూడు విభాగాలను సమీకృతం చేసిన భూభారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని చెప్పారు.

భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్‌ సమయంలో భూభారతి మ్యాప్‌ నిబంధనను కూడా ఈ ఐదు మండలాల్లో అమల్లోకి తెస్తామని, క్రమంగా రాష్ట్రమంతా అమలు చేస్తామని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అదే విధంగా ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్‌ తరహాలో భూధార్‌ నంబర్‌ను కూడా ఈ ఐదు మండలాల్లో కేటాయిస్తామని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగానే ఉంటాయని, ఒక్క క్లిక్‌తో భూముల పూర్తి వివరాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మొబైల్‌ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్‌ 
మంత్రి పొంగులేటి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులు వెల్లడించిన ప్రకారం.. సమీకృత భూభారతి పోర్టల్‌లోకి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ కావచ్చు. తద్వారా భూముల సమాచారం, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్‌ సేవలతోపాటు సిటిజన్‌ డ్యాష్‌ బోర్డు అందుబాటులోకి వస్తాయి.

మైల్యాండ్‌ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ వివరాలు, ఫీడ్‌బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్‌వోఆర్‌ చట్టం, భూధార్‌ నంబర్, దరఖాస్తు వివరాలు, మ్యుటేషన్, ఈసీ, మార్కెట్‌ విలువ, విలేజ్‌ మ్యాప్, ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్, గ్రామాల నక్షా, పాస్‌ బుక్‌ కరెక్షన్‌ వంటి పూర్తి సమాచారం, సేవలు అంవదుబాటులోకి వస్తాయి. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రతి దశలోని వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా సదరు దరఖాస్తుదారుడికి అందుతాయి. ధరణి పోర్టల్‌లోని 36 మాడ్యూల్స్‌ను సమీకృత భూభారతి పోర్టల్‌లో ఒకే చాప్టర్‌ కిందకు తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement