వెలుగుమట్ల కేసులో హైకోర్టు స్పష్టికరణ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలో ఇప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లలో కొందరికి పట్టాలు మంజూరు చేయడంతోపాటు మరికొందరి దరఖాస్తులు పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులతో అర్హులకు అన్యా యం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.
భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేతలను సవాల్ చేస్తూ ఖానాపురానికి చెందిన తాళ్లూరి వెంకట నరసమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు మొత్తం 24 మంది కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 24న ఉదయాన్నే చట్టవిరుద్ధంగా అధికారులు చేపట్టిన కూల్చివేతలు 2014లో హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా.. కొందరికే ఇవ్వడం సరికాదన్నారు. అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టవిరుద్ధంగా ఇళ్లను కూల్చివేయడం చెల్లదన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలోని ఆరుగురికి పట్టా లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. సొంతిళ్లున్న అయిదుగురి విజ్ఞప్తిని తిరస్కరించామని, మిగిలినవారి దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామని వివరించారు. కూల్చివేతల తర్వాత 311 పట్టాలు, 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరిస్తూ, విచారణను వాయిదా వేశారు.


