సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు.
కేసీఆర్ సంతాపం
హరీష్‌రావుకు పితృవియోగంపై బీఆర్‌ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
సీఎం రేవంత్ సంతాపం
హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక ప్రకటనలో హరీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హరీష్ కుటుంబానికి కవిత సానుభూతి
మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మంచి వ్యక్తి: బండి సంజయ్
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాప ప్రకటన విడుదల చేశారు. సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనతో ఎంతో కాలంగా నాకు సాన్నిహిత్యముంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మ వారిని వేడుకుంటున్నా’ అని బండి సంజయ్ ఆ ప్రకటనలో తెలిపారు.


