
జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించింది దక్షిణాది రాష్ట్రాలే
నియోజకవర్గాల పునర్విభజనలో ఆ రాష్ట్రాలకు తీవ్ర నష్టం
మందబలం చూసుకుని బీజేపీ ఏమైనా చేస్తామంటే కుదరదు
జైపూర్ టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉత్తర భారతదేశంలోని ఎంపీల సంఖ్యపై ఆధారపడి ఏర్పడే కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం ఎంపీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని తెలిపారు. జైపూర్‌లో జరుగుతున్న ‘టాక్ జర్నలిజం’9వ ఎడిషన్ చర్చా కార్యక్రమంలో కేటీఆర్ ఆదివారం మాట్లాడారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
డీలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వబోమని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న మాటలను నమ్మలేమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు పెంచలేదని గుర్తుచేశారు. అడగకముందే వారి రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, అస్సాంలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచారని మండిపడ్డారు.
మంద బలం, అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీ లన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని తెలిపారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. తనకు ఇష్టం వచ్చిన పనులు చేస్తానని బీజేపీ అనుకుంటే.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆ పార్టీ నే బాధ్యత వహించాల్సి ఉంటుంది’అని స్పష్టంచేశారు.
బిహార్ ఓటర్ సర్వేపై అనుమానాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని కేటీఆర్ అన్నారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల సవరణ మొదటిసారి కానప్పటికీ దానిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయని, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బిహార్ పరిణామాలపై తమకు చాలా అభ్యంతరాలు ఉన్నాయని, దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం చాలా సులభమని అన్నారు.
బిహార్ పరిణామాలు ప్రజలను విడగొట్టే రాజకీయ కుట్రలో భాగమేనని అనుమానం వ్యక్తంచేశారు. ఎన్నికల తరువాత ఫలితాలపై మాట్లాడటం కంటే ముందే ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. బిహార్‌లో 5 లక్షల మంది ఓట్లు గల్లంతు కావటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. గత ఎన్నికల్లో కేవలం 12,500 ఓట్ల తేడాతో అక్కడ ఆర్జేడీ అధికారాన్ని కోల్పోయిందని గుర్తుచేశారు. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం, మతం, కులం అని స్పష్టంచేశారు.