27న తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సుమారు 450 మంది ముఖ్య నేతలతో సమావేశం
జగిత్యాలలో 20న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ప్లీనరీతో కాకుండా కేవలం ప్రతినిధుల సభతోనే సరిపెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ 25 సంవత్సరాల నేపథ్యంలో గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీంతో ఈసారి ప్లీనరీ కాకుండా ముఖ్య నాయకులతోనే రెండురోజుల ప్రతినిధుల సభను పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ముందు ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోనే మరో సభ నిర్వహించడంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతినిధుల సభకే పరిమితం కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మె ల్యేలు, పార్టీ కార్యవర్గం, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులను కలుపుకొని మొత్తంగా సుమారు 450 మంది ముఖ్య నేతలు ప్రతినిధుల సభకు హాజరవుతారు. అయితే పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ ప్రతినిధుల సభకు హజరవుతారా? లేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షత వహిస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం!
గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ స్వర్ణోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా పార్టీ సభలు, సమావేశాలకు హాజరు కాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టి.జీవన్‌రెడ్డి ఈ నెల 20న జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై స్పందిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీశ్
జగిత్యాల సభకు సుమారు 2 లక్షల మందిని సమీకరించాలని బీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. సభ ఏర్పాట్ల బాధ్యతలను ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జగిత్యాలతో పాటు మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటీఆర్ పార్టీ ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం జగిత్యాలకు వెళ్తున్నారు.
నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్ నేతలు
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 20న మేడిగడ్డ బరాజ్ పరిశీలనకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ సహా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ నేతలు శనివారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


