
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శ్రామిక విభాగం ఉన్నతాధికారులకు భారతీయ ప్రమాణాల బ్యూరో, హైదరాబాద్ శాఖ శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మౌలాలీలోని బీఐఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. పని ప్రదేశాల్లో అనుసరించాల్సిన నియమాలు, పాటించాల్సిన భారతీయ ప్రమాణాలు, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై బీఐఎస్ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
భారతీయ ప్రమాణాల్లో పొందుపరిచిన వ్యక్తిగత భద్రతా పరికరాలు (PPE), సరైన ఎంపిక, వినియోగం మరియు నిర్వహణ, రంగాల వారీ భద్రతా చర్యలు – పనిస్థలాల్లో స్పష్టత కల్పించడం, ఉద్యోగ సంబంధిత ఆరోగ్యం, భద్రతా నిర్వహణ వ్యవస్థ (IS/ISO 45001:2018), నిర్మాణ భద్రత కోడ్స్, తవ్వకం, కూల్చివేత, నిర్మాణ కార్యకలాపాల భద్రత, భద్రతా రంగులు, ప్రమాద నివారణ, దృశ్యరూపక హెచ్చరికలు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు శిక్షణనందించారు.

ఈ సందర్భంగా బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో భద్రత చట్టపరమైన అవసరం మాత్రమే కాదని.. ప్రతీ కార్మికుడు, పారిశ్రామికవేత్తల బాధ్యత అన్నారు. పని చేసేటప్పుడు ధరించే వస్త్రాలు, రక్షణ పరికరాలు, ఆరోగ్య సంబంధిత భద్రతా పరికరాలతో పాటు పాటించాల్సిన నియమాలనూ భారతీయ ప్రమాణాలు చెబుతాయన్నారు. ఈ ప్రమాణాలు ప్రమాదాలను నివారించడంతో పాటు కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పని సామర్థ్యం పెంపునకు తోడ్పడతాయని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్, జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్లు జి సునీత, శ్యామ్ సుందర్ రెడ్డి, ఎం రాజేంద్ర ప్రసాద్తో పాటు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.