
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేసింది. గణేష్ నిమజ్జనాలకు ఇంతవరకు ట్యాంక్ బండ్‌పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గణేష్ ఉత్సవ సమితి ఆవేదన వ్యక్తం చేసింది.
45 ఏళ్ల నుండి ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలు చేస్తున్నామని.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే ఏర్పాటు చేయకపోతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరుఫున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని సమితి సభ్యులు హెచ్చరించారు.
గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. బాలాపూర్ నుంచి మెయిన్ రూట్‌ని పరిశీలించామని.. అన్ని డిపార్ట్‌మెంట్ల తరుపున నెల రోజుల నుంచి పని చేస్తున్నామన్నారు. అన్ని శాఖల కో-ఆర్డినేషన్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. నిమజ్జనం కోసం మెయిన్ ప్రొసెషన్ రూట్‌ని పరిశీలించి చెట్లు, విద్యుత్ వైర్లు తగలకుండా ఆదేశాలు ఇచ్చామని సీవీ ఆనంద్ చెప్పారు.
వర్ష సూచన ఉందని.. మండపం నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని.. 20 వేల మంది స్థానిక పోలీసులు, 9 వేల మంది ఇతర జిల్లాల నుండి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.
‘‘ఇతర కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అన్ని విగ్రహాలు సమయం ప్రకారం వచ్చి నిమజ్జనం చేస్తే బాగుంటుంది. రోడ్లు గుంతలు లేకుండా చూడాలని ఆర్‌అండ్‌బీని అదేశించాం. మిలాద్ ఉన్ నబి పండుగ 6వ తేదీన ఊరేగింపు జరగాల్సి ఉంది. సమన్వయ సమావేశంలో మాత పెద్దలు ఒప్పుకున్నారు. 14వ తేదీన మిలాద్ ఉన్ నబి ర్యాలీ ఉండనుంది. హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేసాం. క్రైమ్ టీమ్స్ నిరంతర గస్తీ ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాం. భవాని నగర్ ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి. భక్తులు ప్రశాంతంగా నిమజ్జనాలు చేసుకోవాలి’’ అని సీపీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.