Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణంలో హైదరాబాదీలు | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణంలో హైదరాబాదీలు

Published Tue, Jan 9 2024 7:10 AM

Ayodhya Temple Doors Made By Hyderabad Based Timber Company - Sakshi

తండ్రీ కొడుకుల ఆప్యాయతకు.. అన్నదమ్ముల అనుబంధానికి.. ఆలూమగల అనురాగానికి.. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. ఆ దైవాంశ సంభూతుడికి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ వైభవం, కళాత్మకత, నగిషిల రూపకల్పన తదితర అంశాలపై యావత్‌ దేశంతో పాప్రపంచమంతా చర్చించుకుంటోంది. అయోధ్య రామమందిరం ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు కొందరు నగరవాసులు.

ప్రధానంగా అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేసే అరుదైన అవకాశం నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన అనురాధ టింబర్స్‌కు దక్కింది. శ్రీరాముని పాదుకల తయారీ కూడా నగరం వేదికగానే జరగడం విశేషం. రామ మందిర అక్షింతలను ప్రతి ఇంటికీ చేర్చడం వంటి పలు కార్యక్రమాల్లోనూ నగరం తన ప్రత్యేకతను చాటుకుంది. అయోధ్య వేదికగా 1990, 1992లలో చేపట్టిన పరిక్రమలో సైతం ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో కరసేవకులు పాల్గొన్నారు. ఆనాటి నుంచే కొనసాగుతున్న అయోధ్యతో సంబంధం ప్రస్తుత రామ మందిర నిర్మాణంలోనూ భాగ్యనగరం తన పాత్ర పోషించింది.  ఆ విశేషాల సమాహారమే ఈ కథనం.
 
గతంలోనే సుప్రసిద్ధ అనంత శేష శయన మహా విష్ణు కళాఖండాన్ని సృష్టించిన అనురాధ టింబర్స్‌ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేపట్టారు. స్తపతి కుమారస్వామి రమేశ్‌ ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు ఆరు నెలలుగా శ్రమిస్తూ అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందిస్తున్నారు. గతంలో యాదాద్రి, రామేశ్వరం వంటి ఆలయాలకు ప్రధాన ద్వారాలను అనురాధ టింబర్స్‌ రూపొందించింది. ఇంతటి అరుదైన ఘనత సాధించిన అనురాధ టింబర్స్‌ నిర్వాహకులు శరత్‌బాబు, కిరణ్‌ కుమార్‌లను సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ స్వయంగా వచ్చి అభినందించడం గమనార్హం. 

పరిక్రమ కోసం ప్రాణాలే పణంగా.. 
1990లో అయోధ్యలో తలపెట్టిన మొదటి పరిక్రమలో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పాల్గొన్నాం. దీని కోసం నగరం నుంచి ఆలె నరేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందం పాల్గొంది. పరిక్రమ తేదీ కన్నా ముందే అయోధ్యకు చేరుకోవాలని రైలులో ప్రయాణిస్తున్న మమ్మల్ని మధ్యప్రదేశ్‌లో ఆపేశారు. అక్కడి నుంచి వారణాసికి మళ్లీ ప్రయాణించాం. కరసేవకుల సమాచారం ముందే తెలుసుకుని అక్కడ కూడా అడ్డుకోవడంతో నేపాల్‌ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా లాఠీచార్జ్‌లు, ఫైరింగ్‌లు, వాటర్‌ ఫైరింగ్‌లను ఎదుర్కొన్నాం. ఒకానొక సమయంలో అరెస్టు చేసి లక్నో జైలులో నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకున్న నన్ను మళ్లీ అరెస్టు చేసి వారణాసి నైనీ జైలులోనూ (సుభాష్‌ చంద్రబోస్‌ను ఉంచిన కారాగారం) నిర్బంధించారు. నేను 30 ఏళ్ల వయసులో మా పోరాటం ఇప్పుడు సఫలీకృతం కావడం మహదానందం.   – నాయిని బుచ్చి రెడ్డి, అప్పటి కరసేవకుడు 
 
మాది సాంకేతిక సహకారం మాత్రమే.. 
రామాలయ ప్రధాన ద్వారాల రూపకల్పనలో  తాము సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తున్నాం.   అయోధ్య ట్రస్టు మార్గదర్శకత్వంలో టాటా కన్సలి్టంగ్‌ ఇంజినీరింగ్, ఎల్‌అండ్‌టీ సంస్థల సమన్వయంతో కలపతో చేసిన తలుపుల పనుల్లో భాగస్వాములమయ్యాం. తమిళనాడులోని మహాబలిపురం ప్రాంతానికి చెందిన స్తపతి కుమార స్వామి రమేశ్‌ బృందం ఆధ్వర్యంలో ఆరు నెలలుగా అయోధ్య ఆలయ ప్రాంగణంలోనే తలుపుల తయారీ చేయిస్తున్నాం. తొలుత 18 ప్రధాన ద్వారాలకు తలుపులు తయారు చేశాం. అనంతరం మరో 100కు పైగా అంతర్గత ద్వారాలకూ తలుపులు రూపొందిస్తుం.  
– శరత్‌ బాబు, అనూరాధ టింబర్స్‌ నిర్వాహకులు 

రఘురాముడి పాదుకల తయారీలో.. 

►సాధారణ ఇత్తడి బిందెలు తయారు చేసే పిట్లంపల్లి రామలింగాచారి నిబద్ధతతో కూడిన శిల్పిగా మారి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పాదుకలను తయారు చేసే అవకాశాన్ని పొందారు. అయోద్య శ్రీరాముని పాదుకలు 12 కిలోల 600 గ్రాముల పంచలోహాలతో తీర్చిదిద్దారు. వాటిపై బంగారు తాపడం చేశారు. నిత్యం నిగనిగలాడేలా పాదుకలపై శంకు, చక్రం, శ్రీరాముని బాణం, దేవాలయంపై ఉండే జెండా వంటివి ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక్కో పాదుక 6.3 కిలోలు ఉండేలా తయారు చేశారు. 12 తులాలకు పైగా బంగారు తాపడం చేశారు. వందేళ్లకు పైగా పాదుకలు చెక్కు చెదరకుండా తయారు చేయడంలో రామలింగాచారి సఫలీకృతుడయ్యారు. 1987లో బెంగళూరులోని రీజినల్‌ డిజైన్‌ అండ్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో రెండేళ్లు లోహ శిల్ప విద్యలో పట్టా అందుకున్న ఆయన.. 1993లో ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌లోని హస్మత్‌పేటలో శ్రీ మది్వరాట్‌ కళా కుటీర్‌ను ఏర్పాటు చేసుకుని లోహ శిల్పాల తయారీలో నిమగ్నమయ్యారు.  

► అద్భుతమైన కళా నైపుణ్యంతో దేవతా మూర్తులు, గాలి గోపురాలు, కంఠాభరణాలు, నాగాభరణాలు, మండపాల నిర్మాణాలు రూపొందించడంలో నిష్ణాతులుగా మారారు. రామలింగాచారి పనితనం తెలుసుకుని భాగ్యనగర సీతారామ సేవా ట్రస్ట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రి అయోధ్య రామాలయంలోని గుర్భగుడిలో ఏర్పాటు చేసే శ్రీరాముని పాదుకలను తయారీ పనులను ఆయనకు ప్రత్యేకంగా అప్పగించారు. 25 రోజుల పాటు నియమ నిష్టలతో ఎంతో శ్రమకోర్చి పాదుకలను తయారు చేశారు రామలింగాచారి. అయోధ్య శ్రీ రాముని పాదుకలతో వెలుగులోకి వచి్చన రామలింగాచారికి అమెరికాలో నిర్మిస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి మూల విరాట్‌లు, కలశాలు, మకర తోరణాలు, గాలిగోపురాలు వంటివి రూపొందించే అవకాశం వచి్చంది.

విశ్వకర్మలకూ నంది అవార్డులివ్వాలి.. 
ఉగాదిని పురస్కరించుకుని సినిమా వాళ్లకు ఇస్తున్న నంది అవార్డుల మాదిరిగానే శిల్పాలను సృష్టిస్తున్న విశ్వకర్మలకు అవార్డులను అందిస్తే మరింత బాధ్యతగా శిల్పాలను సృష్టించగలుగుతారు. కళాకారుల శ్రమను గుర్తించి మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. 
    – రామలింగాచారి, లోహశిల్పి

ఇదో మహదావకాశం.. 
చారిత్రక అయోధ్య రామాలయ ద్వారాల రూపకల్పన అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మహాబలిపురంలోని ప్రభుత్వ కళాశాలలో ఎనిమిదేళ్ల పాటు శిల్పశా్రస్తాన్ని నేర్చుకుని 2000 సంవత్సరంలో డిగ్రీ పొందా. 20 ఏళ్లుగా అనురాధ టింబర్స్‌తో కలిసి పనిచేస్తున్నా. 2005లో రామేశ్వరం దేవాలయ ద్వారాలు రూపొందించాం. 2008లో కాంచీపురం ఏకాంబేశ్వరన్‌ టెంపుల్‌ రథాన్ని తయారు చేశాం. 2015లో శ్రీరంగం దేవాలయంలో కలప పనులు చేశాం. 2019లో మలేసియాలోని మురుగన్‌ టెంపుల్‌ బంగారు రథం, 2020లో లండన్‌లోని ధనలక్ష్మి దేవాలయ బంగారు రథం, 2021లో జర్మనీలోని గణేశ్‌ దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలప పనులు చేశాం.        
– స్తపతి కుమార స్వామి రమేశ్‌ 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement