బతికుండగానే చంపేశారు

Approach Officials For Widow Pension Recorded As Dead At Muchintal - Sakshi

సాక్షి,  శంషాబాద్‌ రూరల్‌: ఓ మహిళను బతికుండగానే అధికారులు చంపేశారు.. రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు కావడంతో ఆమెకు వితంతు పింఛన్‌ మంజూరు కావడంలేదు.. పింఛన్‌ కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఆమె చివరకు గ్రామసభలో తన గోడు వెళ్లపోసుకుంది.. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్‌ డబ్బాను చూపిస్తూ గ్రామసభలో ఆందోళనకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..  మండల పరిధిలోని ముచ్చింతల్‌కు చెందిన బీర్ల మణెమ్మ(48) భర్త సత్తయ్య 2018లో మృతి చెందాడు.

దీంతో ఆమె వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంది. ఎన్నిసార్లు పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగినా పలు రకాల కారణాలు చెబుతూ వచ్చారు. చివరకు ఆమె కూడా చనిపోయినట్లు రికార్డులో నమోదు అయినందున పింఛను రావడంలేదని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన గ్రామ సభకు కిరోసిన్‌ బాటిల్‌తో వచ్చి ఆందోళన చేపట్టింది. తనకు ఎలాంటి ఆధారం లేదని పింఛను మంజూరు చేయాలని వేడుకుంది. తనకు ప్రతి నెలా రేషన్‌ కూడా వస్తుందని, పింఛను మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం 
మణెమ్మ పేరుతో 2018 డిసెంబర్‌ వితంతు పింఛను మంజూరైంది. అప్పటి నుంచి వరుసగా మూడు నెలల పాటు ఆమె పింఛన్‌ డబ్బులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పింఛన్‌ నిలిచిపోయింది. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె పింఛన్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తే విషయం తెలిసింది. మణెమ్మ బతికి ఉన్నట్లు ఆమె పేరుతో పింఛను మంజూరు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆన్‌లైన్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశాం.     
– రాజుకుమారి, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, ముచ్చింతల్‌.  

(చదవండి: నీ జీవితం నువ్వు చూసుకో.. భార్యకు మెసేజ్‌ చేసి హోంగార్డు ఆత్మహత్య)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top