కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే | Annually increasing admissions in Engineering: telangana | Sakshi
Sakshi News home page

కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే

Sep 22 2024 5:53 AM | Updated on Sep 22 2024 6:14 AM

Annually increasing admissions in Engineering: telangana

ఏటా పెరుగుతున్న ప్రవేశాలు 

ఈ ఏడు లక్షపైనే చేరికలు

మోజు పెంచిన కంప్యూటర్‌ సైన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020–21లో 186 ఇంజనీరింగ్‌ కాలేజీలుంటే, 2024–25 విద్యా సంవత్సరానికి అవి 174కు తగ్గాయి. 20–21లో 98,988 ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే, ఈ ఏడాది సీట్లు 1,12,069కు పెరిగాయి. 

ఇంజనీరింగ్‌లో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ, ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది. చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదని ప్రవేశాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థులు 
ఇంటర్‌ నుంచే హైదరాబాద్‌లో చదివేందుకు వస్తున్నారు. ఇదే ట్రెండ్‌ ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి.


ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ వైపే..
రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల మంది ఇంటర్మిడియట్‌ పాసవుతున్నారు. ఇందులో 75 శాతంపైగా ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో లక్ష మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరుతున్నారు. ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లో చేరేవాళ్లు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సంస్థల్లో చేరేవాళ్లు మరో 10 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి 2.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. 

వీరిలో 1.80 లక్షల మంది పాసయ్యారు. కనీ్వనర్‌ కోటా కింద 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు కలిపి మొత్తం 86,943 సీట్లు ఉన్నాయి. వీటిలో 75,107 సీట్లు భర్తీ చేశారు. దాదాపు 31 వేల బీ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్‌ వర్సిటీల క్యాంపస్‌లలో కనీసం 10 వేల మంది చేరినట్టు అంచనా. బాసర ఆర్‌జీయూకేటీ, హెచ్‌సీయూలోని సీఆర్‌రావు విద్యా సంస్థతో పాటు తమిçళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్‌ వర్సిటీల్లో మరో 10 వేల మంది చేరే వీలుంది.  

ఎందుకీ క్రేజ్‌
ఇంజనీరింగ్‌ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాలన్నీ కంప్యూటర్‌ కోర్సులు చేసినవారితోనే జరుగుతున్నాయి. డిగ్రీ, ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్‌ అనుబంధం ఉంటే తప్ప ఐటీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

దీంతో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రైవేటు కాలేజీలు కూడా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో పాటు అన్ని బ్రాంచీల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతోంది. అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌పై క్రేజ్‌ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.  

ఏఐ ప్రభావమే మార్చేస్తోంది 
ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచీల్లోనూ ఆరి్టఫిíÙయల్‌ టెక్నా లజీ దూసుకొస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌లోనే కాదు... సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టం. అందుకే బ్రాంచీ ఏదైనా ఏఐ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్‌ చేస్తూనే... ఏఐ నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు.  – డాక్టర్‌ కె.విజయకుమార్‌రెడ్డి రెక్టార్, జేఎన్‌టీయూహెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement