ఆదిలాబాద్ టౌన్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆదిలాబాద్‌లోని రాణిసతీజి కాలనీలో ఉన్న పత్తి వ్యాపారి సచిన్ ఇంటి ఎదుట సోమవారం ఉదయం నుంచి బైఠాయించారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేసి గేటు ఎదుట పడుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన 32మంది రైతులు అమరావతి రాజధానిగా ఏర్పడిన సమయంలో తమ భూములను విక్రయించారు.
వచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేశారు. బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తుండటంతో స్థానిక వ్యాపారి లిల్లి మధ్యవర్తిత్వంతో ఆదిలాబాద్‌కు చెందిన సచిన్‌కు రెండున్నర రూపాయల వడ్డీతో రూ.6కోట్లు అప్పు ఇచ్చారు. ఈ మేరకు రూ.2కోట్ల నగదు చేతికివ్వగా రూ.4కోట్లు బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేశారు. రెండు నెలల్లోనే అప్పు తీర్చేస్తానని సచిన్ హామీ ఇచ్చి దాదాపు ఏడాదిన్నరవుతున్నా స్పందించడం లేదు. 2021 ఆగస్టులో డబ్బులు ఇచ్చామని, పలుమార్లు కలువగా రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీరుమున్నీరయ్యారు.
అందుబాటులో లేని వ్యాపారి..
కాగా సదరు వ్యాపారి అందుబాటులో లేరని కుటుంబీకులు తెలిపారు. ఓ న్యాయవాదితో మధ్యవర్తిత్వం చేయించినట్లు రైతులు చెబుతున్నారు. 45 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేలా చూస్తానని న్యాయవాది వారికి చెప్పగా.. చెక్కులు, నోట్‌లు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్తామని తెలిపారు. అందుకు న్యాయవాది ఒప్పుకోలేదని అంటున్నారు. రైతులకు సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వ్యాపారి డబ్బులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో రైతులతోపాటు ఇక్కడే బైఠాయించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment