అమెరికా యువతి నోట తెలుగు మాట | American woman Anna Remillard speak telugu | Sakshi
Sakshi News home page

అమెరికా యువతి నోట తెలుగు మాట

Jul 10 2024 8:07 AM | Updated on Jul 10 2024 8:46 AM

American woman Anna Remillard speak telugu

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తెలుగు భాష తియ్యదనం తెలుసుకున్న వారికే అర్థం అవుతుంది. కాకపోతే మన భాషను మనమే పరాయి భాషగా చూస్తున్నాం. ఇప్పుడున్న యువతలో చాలా మంది తెలుగు మాట్లాడటానికే నామోషిగా భావిస్తున్నారు. ఇప్పటి తరం యువత తెలుగు స్పష్టంగా చూస్తూ చదవడానికే చాలా కష్టపడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే తెలుగు భాష అంటే మార్కుల కోసం అన్నట్టు చెబుతున్నారు. నాలుగు పద్యాలు బట్టీ పట్టిస్తే చాలు అన్నట్లుంది పరిస్థితి.  కానీ అమెరికాలో పుట్టి.. అమెరికాలో పెరిగి తెలుగుపై మక్కువ పెంచుకుని తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు ఏనా . ఆమె గురించిన మరిన్ని వివరాలు..

   

తెలుగు భాష నేర్చుకోవడం చాలా కష్టమంటూనే ప్రావీణ్యం సంపాదించారు. మాట్లాడటమే కాదు.. రాయడం, చదవడం కూడా నేర్చుకున్నారు. అంతేకాదు యూట్యూబ్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా.. హైదరాబాద్‌తో తనకున్న అనుభవాలను వీక్షకులతో పంచుకుంటూనే.. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెబుతున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు. ఆమె పేరే ఏనా రెమిల్లార్డ్‌. 

ఇతర భాషలపై ఆసక్తితో.. 
‘చిన్నప్పటి నుంచే కొత్త భాషలు, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి ఉండేది. అమెరికాలోని యూనివర్సిటీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో మూడో సంవత్సరం వేరే దేశాల్లోని వర్సిటీల్లో చదువుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుకున్నాను. హెచ్‌సీయూలో తోటి విద్యార్థులతో కలసి భారత్‌లోని మతాలు, కులాల గురించి అధ్యయనం చేసేందుకు చాలా ప్రాంతాలు తిరిగాను. అప్పుడే దేశంలోని అనేక సంప్రదాయాల గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలోనే తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తితో పాటు సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని రెమిల్లార్డ్‌ వివరించారు. 

అద్భుతమైన ఉచ్చారణ.. 
అమెరికాలో పుట్టినప్పటికీ రెమిల్లార్డ్‌ తెలుగు భాష ఉచ్ఛారణ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతి పదాన్నీ ఎలా పలకాలో ఇక్కడి తెలుగు గురువుల నుంచి ఇప్పటికీ అడిగి తెలుసుకుంటారు. మొదట్లో తెలుగు భాష ఎవరైనా మాట్లాడితే భయంగా ఉండేదట. కానీ, చాలా సీరియస్‌గా సాధన చేసి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. అయితే ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఇంకా ప్రావీణ్యం సాధించాల్సిన అవసరం ఉందని, తెలుగులో నిత్య విద్యారి్థనేనని చెప్పుకొచ్చారు.  

భారత సంస్కృతి అంటే ఇష్టం.. 
ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు అంటే తనకు చాలా ఇష్టమని రెమిల్లార్డ్‌ పేర్కొన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఎంతో ఇష్టమని వివరించారు. అమెరికాలో ఇలా తక్కువగా ఉంటారన్నారు. కాగా, వేరే దేశాలకు వెళ్లి వారి భాష మాట్లాడితే అంతగా పట్టించుకోరని, అదే ఇక్కడి ప్రజలతో వారి భాషలో మాట్లాడితే చాలా సంతోíÙస్తారని చెప్పారు. తెలుగుతో పాటు హిందీ కూడా నేర్చుకున్నానని, ఇక్కడి వారు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడతారని ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే చాలా మంది తమ మాతృభాష అయిన తెలుగు భాషలో మాట్లాడేందుకు అయిష్టత చూపుతున్నారని, అలా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 

మరింత నైపుణ్యం సాధిస్తా.. 
తెలుగులో ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నానని, ఇంకా నైపుణ్యం సాధించేందుకు కష్టపడుతున్నానని రెమిల్లార్డ్‌ చెప్పుకొచ్చారు. హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్టు అమెరికా సమాజం ఉండదని, సినిమాలకు, నిజజీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని వివరించారు. సినిమాల వల్ల కూడా అమెరికా సమాజాన్ని వేరే దేశాల వారు అపార్థం చేసుకుంటున్నారని చెప్పారు. అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టడీస్‌ అనే సంస్థలో తెలుగు నేర్చుకున్నట్టుగా ఆమె తెలిపారు.

భాషతో పాటు సంస్కృతి కూడా..  
విదేశీ విద్యార్థులకు 20 ఏళ్లుగా తెలుగు చెబుతున్నాను. వీరికి కొత్త భాష నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు తెలుగుతో పాటు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను బోధిస్తుంటాం. 
– కొల్లాపురం విమల, తెలుగు ప్రొఫెసర్‌  

ఎంతో కష్టపడుతుంటారు.. 
రెమిల్లార్డ్‌ తెలుగు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడేవారు. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా అడిగి తెలుసుకునేవారు. ఉచ్చారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తెలుగులో ఏ డౌట్‌ వచి్చనా ఇప్పటికీ అడుగుతుంటారు. ఆమెతో పాటు చాలా మంది విద్యార్థులు మా వద్ద తెలుగు నేర్చుకున్నారు. 
– డాక్టర్‌ చంద్రయ్య శివన్న, తెలుగు ప్రొఫెసర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement