విద్యకు బడ్జెట్‌లో 15 శాతం నిధులిస్తాం | Allocating 15 pc budget on education: CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

విద్యకు బడ్జెట్‌లో 15 శాతం నిధులిస్తాం

May 12 2026 12:47 AM | Updated on May 12 2026 12:47 AM

Allocating 15 pc budget on education: CM Revanth Reddy

రూ.1,700 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అజహరుద్దీన్, వివేక్, శ్రీధర్‌బాబు, పొంగులేటి, పొన్నం తదితరులు

ఈ ఏడాది రూ.26,674 కోట్లు కేటాయించాం 

ఇది బడ్జెట్‌లో 8.22 శాతం.. ఏటా కేటాయింపులు పెంచుతూ 15 శాతానికి చేర్చుతాం  

అత్యుత్తమ బోధన చేపట్టిన టీచర్లను గుర్తించి ఘనంగా సన్మానిస్తాం 

ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల ప్రారంభ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని రా­ష్ట్ర విద్యా కమిషన్‌ సిఫారసు చేసిందని, అయితే ఒక్కరోజులో ఈ కేటాయింపులను పెంచే పరిస్థితి ఉండదన్నారు. కేటాయింపులను ప్రతి ఏటా బడ్జెట్‌లో క్రమంగా పెంచుతూ పోతామని, 15 శాతానికి పెరిగే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోంది. సోమవారం ఎల్బీ స్టేడియం­లో విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి టీచర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘విద్యా­శాఖకు ఈ ఏడాది రూ.26,674 కోట్లు కేటాయించాం. రాష్ట్ర బడ్జెట్‌లో 8.22 శాతం కేటాయింపులు జరిపాం.

గతేడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు పెంచాం. ఇదేవిధంగా ఏటా పెంచుతాం. ఓఆర్‌ఆర్‌ లోపల క్యూర్‌ ప్రాంతంలో రూ.1,700 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. వర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యా­న్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని తండా­లు, గూడేలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను నేనే నిర్వహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.

ప్రజాప్రభుత్వంలో కేవలం 60 రోజుల వ్యవధిలో 11 వేల మంది టీచర్లను నియమించడం చరిత్రాత్మక అంశం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 22 వేల టీచర్లకు పదో­న్నతులు, 36 వేల మంది టీచర్లకు బదిలీలు పూర్తి చేశాం. నీతిఆయోగ్‌ నివేదికలో విద్యలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది. ఇందుకు విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నాను. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షలకు పైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.1.05 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నాడు. 

విదేశాల్లో విద్యాబోధన, అభ్యసన కార్యక్రమాల పరిశీలనకు టీచర్లను పంపుతాం 
దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో విద్యా­విధానాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. మంత్రు­­లు, ఉన్నతాధికారులే కాదు.. క్షేత్రస్థాయిలో బోధించే టీచర్లు ఈ అధ్యయనంలో భాగం కావాలి. అందుకే ఇటీవల 25 మంది ప్రభుత్వ టీచర్ల బృందాన్ని ఫిన్లాండ్‌కు పంపించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపించాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా మరో ప్రత్యేక దినాన టీచర్లకు సన్మానం చేస్తాం.దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం. పదోతరగతి పాసైన తర్వాత ఇంటర్‌లో డ్రాపౌట్స్‌ను అరికట్టేందుకే ఈ నిర్ణయం. వర్సిటీలల్లో సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాం. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్‌ డ్రెస్, మరో జత జూన్‌ నెలాఖరున ఇస్తాం.

ఎడ్యుకేషన్‌ కిట్‌ కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగం కాదు భావ్వోదేగం. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలి. విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. కావాలనే నేను విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను’అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను సీఎం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్‌ అజహరుద్దీన్, జి.వివేక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement