అదనపు ధాన్యమంతా ఎగుమతులకే | All surplus grain is for export | Sakshi
Sakshi News home page

అదనపు ధాన్యమంతా ఎగుమతులకే

Jul 22 2023 2:06 AM | Updated on Jul 22 2023 9:40 AM

All surplus grain is for export - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్‌సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు.

రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్‌ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... 
‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం.

అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్‌ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.  

కమిటీ సభ్యులు వీరే... 
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్‌ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్, టీఎస్‌ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 

40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! 
రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నులను గ్లోబల్‌ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభు­త్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్ల­ర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్‌ చేయకపోవడంతో మిలు­్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయా­యి. నిర్దేశత సమయంలో సీఎంఆర్‌ ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ కొర్రీ­లు పెడు­తోం­ది. దాదాపు 1.10 కోట్ల మెట్రి­క్‌ టన్ను­ల ధాన్యం, 4 లక్షల మెట్రిక్‌ టన్ను­ల బి­య్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement