Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!

Aarogyasri Services In Hospitals Are Not Provided Properly In Telangana - Sakshi

ప్రభుత్వం నుంచి బకాయిలు రావడం లేదంటూ చేతులెత్తేస్తున్న వైనం 

ఏదో ఒక కారణం చెప్తూ తిప్పిపంపేస్తుండటంతో రోగుల అవస్థలు 

అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి 

ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించాలని కొన్ని ఆస్పత్రుల విజ్ఞప్తి  

రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి.   
– సాక్షి, హైదరాబాద్‌

  • మేడ్చల్‌కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్‌పేషెంట్‌ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్‌ సీటీ స్కాన్‌ చేయాలని, ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్‌ చేసుకోవాలని రిఫర్‌ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్‌ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్‌ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్‌ అయ్యారు. 
  •  నల్లగొండకు చెందిన రాజేందర్‌ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్‌ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్‌ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు

 రూ. 900 కోట్లకుపైగా బకాయిలు 
రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్‌ఎస్‌ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్‌ శివార్లలో మళ్లీ భూముల వేలం..!

రోగులకు తీవ్ర అవస్థలు 
ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్‌పేషెంట్‌ సేవలేకాకుండా.. ఔట్‌పేషెంట్‌ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. 

ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. 
ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెప్తున్నాయి. 

ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్‌! 
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్‌చార్జులే.. 
ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్‌ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్‌ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్‌లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్‌కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు.

ఏడాదిన్నరగా సంక్షోభం 
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. 
– డాక్టర్‌ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

3 కోట్లు బకాయిలు రావాలి 
మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. 
– జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top