
రాజధానిలో ఏడు నెలల్లో 98.2 లక్షల వైలేషన్స్
వితౌట్ హెల్మెట్ వంటి ప్రమాదకరమైనవే అధికం
గత ఏడాదిని మించిపోనున్న ఈ ‘ట్రాఫిక్ కేసులు’
సాక్షి, హైదరాబాద్: జంక్షన్‌లోని ఓ మార్గంలో వస్తున్న వాహనాలు ఆగాలంటూ సిగ్నల్‌లో రెడ్ లైట్ పడిందంటే... మరో మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు వెళ్లాలంటూ గ్రీన్‌లైట్ పడుతుంది. ఇలాంటి సందర్భంలో రెడ్‌లైట్ పడిన మార్గంలోని వాహనాలు స్టాప్‌లైన్ దాటి ముందుకు వచి్చనా... సిగ్నల్ జంప్ చేస్తూ దూసుకుపోవాలని ప్రయతి్నంచినా... ఆ ప్రభావం గ్రీన్‌లైట్ ఉన్న మార్గంలో వచ్చే వాహనాలపై ఉండి ట్రాఫిక్ జామ్ అవుతుంది.
నగరంలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటానికి మౌలిక వసతుల లేమి, ఆక్రమణలు, సిబ్బంది కొరతతో పాటు... వాహనచోదకులు చేసే ఉల్లంఘనలూ ఓ కారణమని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాంటిది రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి సరాసరిన రోజుకు 44 వేల ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి–జూలై మధ్య నమోదైన వైలేషన్స్ సంఖ్య 92.8 లక్షలుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అత్యంత ప్రమాదకరమైనవే అధికం...
రహదారి భద్రతకు సంబంధించిన నిబంధనలు అనేకం ఉన్నాయి. పోలీసులు, నిపుణులు వీటిని మూడు రకాలుగా విభజిస్తారు. వాహన చోదకుడికి ముప్పుగా పరిణమించేవి, ఎదుటి వారికి ముప్పుగా పరిణమించేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పుగా పరిణమించేవి. వీటిలో మూడో కోవకు చెందిన వాటినే ట్రాఫిక్ విభాగం అధికారులు ఎక్కువ తీవ్రంగా పరిగణిస్తారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్... తదితరాలన్నీ వీటి కిందికి వస్తాయి. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో నమోదవుతున్న ఉల్లంఘనల్లో ఇవి కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న వాహనాల సంఖ్యలో ద్విచక్ర వాహనాలే 80 శాతం వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన హెల్మెట్ లేకుండా వాహనం నడపటం (వితౌట్ హెల్మెట్) ఉల్లంఘనపై జారీ అయిన ఈ–చలాన్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో నమో దైన చలాన్ల గణాంకాల ఆధారంగా వీటి సంఖ్య గత ఏడాది కంటే ఎక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పూర్తిగా నాన్ కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్...
ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తుంటారు. దీన్నే సాంకేతిక పరిభాషలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా పిలుస్తారు. ఒకప్పడు కేవలం కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానం అమలులో ఉండేది. క్షేత్రస్థాయి విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉండే చలాన్ పుస్తకాలను వినియోగించి ఉల్లంఘనులకు జరిమానాలు విధించే వారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో అపశృతులు, ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆపై కొన్నేళ్లుగా పూర్తిస్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ట్రాఫిక్ ఉల్లంఘనులకు జరిమానా విధింపు మొత్తం ఈ–చలాన్ ద్వారా జరిగిపోతుంది. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు, సీసీ కెమెరాల ద్వారా తీసిన ఫొటోల ఆధారంగా కంట్రోల్ రూమ్‌లోని సర్వర్ వీటిని జారీ చేస్తుంటుంది. ఉల్లంఘనల నమోదు పెరడగానికి ఇదీ ఓ కారణంగా మారింది.