పోలింగ్‌లో టాప్‌! లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో పెరిగిన పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌లో టాప్‌! లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో పెరిగిన పోలింగ్‌

Published Mon, May 27 2024 4:34 AM

2024 Lok Sabha elections polling increased in majority seats in Telangana

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో పెరిగిన పోలింగ్‌

దేశంలోని టాప్‌ 25 స్థానాలకుగాను 9 స్థానాలు తెలంగాణలోనే నమోదు 

3.6 లక్షల ఓటర్ల పెరుగుదలతో దేశంలోనే మూడో స్థానంలో చేవెళ్ల 

మరో 8 చోట్ల కూడా కనీసం 1.8 లక్షల చొప్పున పెరిగిన ఓటర్లు 

పెరిగిన ఓట్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయన్న విషయమై సర్వత్రా ఆసక్తి 

నాలుగో దశ పోలింగ్‌ ముగిశాక ఎస్‌బీఐ రీసెర్చ్‌ టీమ్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ రాష్ట్రంలో ముగిసిన దాదాపు 15 రోజుల తర్వాత విడుదలైన ఓ అధ్యయనం ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెల 13న నాలుగు దశల పోలింగ్‌ తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ జాబితాలో అస్సాంలోని ధుబ్రీ లోక్‌సభ తొలి స్థానంలో నిలవగా మూడో స్థానంలో చేవెళ్ల నియోజకవర్గం నిలిచింది. దేశవ్యాప్తంగా భారీగా ఓట్లు పెరిగిన 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 9 తెలంగాణలోనే ఉన్నాయి. 

చేవెళ్లతోపాటు మల్కాజిగిరి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, భువనగిరి, మెదక్, నాగర్‌కర్నూల్, జహీరాబాద్, వరంగల్‌లో పోలైన ఓట్ల సంఖ్య పెరిగినట్లు ఎస్‌బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రతి ఎన్నికల సమయంలో కొత్తగా ఓటర్లు చేరడం, పోలైన ఓట్ల సంఖ్య పెరగడం సాధారణమే అయినా, ఈసారి దేశంలోనే టాప్‌ 25 నియోజకవర్గాల్లో 9 తెలంగాణలోనే ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో పెరిగిన ఓట్లు ఎవరికి లాభం చేకూరుస్తాయి? ఎవరికి నష్టం చేకూరుస్తాయన్నది కూడా మరింత ఆసక్తికరంగా మారింది. 

మహిళల ఓట్లు ఎక్కువగా పెరిగాయన్న ఎస్‌బీఐ అధ్యయనం బట్టి ఈసారి మహిళా ఓటర్లు రాజకీయ పారీ్టల తలరాతలను మార్చడంలో కీలకపాత్ర పోషించనున్నారని ఆర్థమవుతోంది. కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న వారిలో ఎందరు ఓటేశారు? పెరిగిన ఓట్లలో వారి శాతం ఎంత? పాత ఓటర్లలో ఎందరు ఓటేశారు? పెరిగిన ఓట్లలో వారి శాతం ఎంత? మహిళల్లో కొత్త ఓటర్లు ఎక్కువగా ఓటేశారా లేక పాత ఓటర్లే పోటెత్తారా? ఈ ట్రెండ్స్‌ ఎవరిని విజయతీరాలను చేరుస్తాయన్నది బ్యాలెట్‌ బాక్సులు తెరిస్తేనే తేలనుంది. 

మల్కాజిగిరిలో చూస్తే....! 
2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం పరిధిలో 15,63,063 ఓట్లు పోలవగా ఈసారి 19,19,131 ఓట్లు పోలయ్యాయి. అయితే 2019లో ఈ నియోజకవర్గంలో మొత్తం 31,49,710 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 37,79,596కు పెరిగింది. అంటే 6.3 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. 

ఈ లెక్కన 2024లో పోలైన 50.78 శాతం ఓట్ల లెక్క ప్రకారం దాదాపు 3.2 లక్షల ఓట్లు ఎక్కువ రావాలి. కానీ 3.56 లక్ష ఓట్లు అధికంగా పోలయ్యాయి. అంటే ఈ పెరుగుదల ప్రస్తుత పోలింగ్‌ శాతం కంటే ఎక్కువ ఉందన్నమాట. అయితే కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న వారి నుంచే ఈ ఎక్కువ పోలింగ్‌ జరిగిందా? పాత ఓటర్లు పెరిగారా? పెరిగిన ఓటర్లలో పురుషులు ఎంతమంది? మహిళలు ఎంతమంది? అనేది కూడా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది. 

ఎస్‌బీఐ అధ్యయనంలో వెల్లడైన అంశాలు 
– నాలుగు దశల్లో కలిపి 2019లో 21.95 కోట్ల మంది పురుషులు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోగా 2024లో 22.80 కోట్ల మంది ఓటేశారు. 2019లో 20.59 కోట్ల మంది మహిళలు ఓటేయగా 2024లో 21.53 కోట్ల మంది ఓటేశారు. అంటే 85 లక్షల మంది పురుషులు ఈసారి ఓటు హక్కు ఎక్కువ వినియోగించుకోగా మహిళా ఓటర్ల సంఖ్య మాత్రం 94 లక్షలు పెరిగింది. 

– 2019తో పోలిస్తే తొలి నాలుగు దశల్లో 2024లో పోలింగ్‌ శాతం తగ్గింది. 2019లో తొలి నాలుగు దశల సగటు పోలింగ్‌ 68.15 శాతంకాగా 2024లో అది 66.95 శాతంగా నమోదైంది. అదేంటి.. పోలింగ్‌ శాతం తగ్గితే ఓటర్ల సంఖ్య కూడా తగ్గాలని అనుకుంటున్నారా? 2019తో పోలిస్తే 2024లో ఓటర్ల సంఖ్య పెరిగినందున గతం కంటే పోలింగ్‌ శాతం తగ్గినా ఓటర్ల సంఖ్య పెరిగింది. 

– 90 శాతం నియోజకవర్గాల్లో 2019లో పోలైన ఓట్ల సంఖ్యతో సమానంగా లేదంటే అంతకంటే ఎక్కువ ఓట్లు 2024లో పోలయ్యాయి. 181 పార్లమెంటు స్థానాల్లో 50 వేల కంటే ఎక్కువ ఓట్లు పోలవగా 156 చోట్ల 50 వేలలోపు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కేవలం 36 నియోజకవర్గాల్లో 50 వేల కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. 

– 2019తో పోలిస్తే 2024లో పెరిగిన ఓట్లు 6 శాతం కాగా కర్ణాటకలో 35.5 లక్షలు, తెలంగాణలో 31.9 లక్షలు, మహారాష్ట్రలో 20 లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. తగ్గిన రాష్ట్రాల్లో కేరళ (5.3 లక్షలు), మణిపూర్‌ (3.4) లక్షలు ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement