ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతి
సైకిల్ నుంచి పడి చికిత్స పొందుతూ నేడు కొడుకు
ఎవరి కోసం బతకాలె కొడుకా అంటూ తల్లడిల్లిన తల్లి హృదయం
కరీంనగర్ జిల్లా శంషాబాద్‌లో విషాదం
కరీంనగర్ జిల్లా: అనారోగ్యంతో భర్త దూరమైనా ఒక్కగానొక్క కొడుకే సర్వస్వంగా భావిస్తూ ఆ తల్లి కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంది. భర్త దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే కొడుకు వెన్నెముక వ్యాధి బారిన పడ్డాడు. ఆపరేషన్‌కు రూ.లక్షలు అవసరం కాగా.. ఎలాగోలా సొమ్ము పోగు చేసుకుంది. ఇక కొడుక్కు ఏ బాధ లేదనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. సైకిల్‌పై వెళ్తున్న బాలుడు కింద పడడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శంషాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొనగా.. ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.. స్థాని కుల కథనం ప్రకారం.. శంశాబాద్ గ్రామానికి చెందిన బాకారపు రాజేశ్వరి– కుమార్ దంపతుల కొడుకు అక్షిత్(11) ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా రాజేశ్వరీ కూలీ పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. అక్షిత్ కొద్ది నెలల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఆపరేషన్‌కు రూ.16 లక్షలు అవసరం కాగా.. రూ.9లక్షలు పోగు చేశారు.
ఇటీవల అక్షిత్ సైకిల్ నుంచి పడగా మెదడులో రక్తం గడ్డకట్టింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజులు అక్కడ చికిత్స పొందగా.. రక్తకణాలు పెరుగుతూ, తగ్గుతున్నాయని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం బాలుడు చనిపోయాడు. ‘నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ అంత్యక్రియల్లో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. సర్పంచ్ మెరుగు కళావతి సంపత్ రూ.3,016 ఆర్థికసాయం అందించారు.


