NIRF Rankings 2023: Telangana Educational Institutes Fare Poorly In List - Sakshi
Sakshi News home page

జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన తెలంగాణ యూనివర్సిటీలు.. కారణం అదేనా!

Jun 6 2023 10:29 AM | Updated on Jun 6 2023 12:05 PM

Telangana Educational Institutes Fare Poorly in NIRF Ranking 2023 List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్‌ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్‌ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఏటా ర్యాంకులు ఇస్తుంది.  

ఐఐటీ–హైదరాబాద్‌ దూకుడు.. ఓయూ వెనక్కు 
జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్‌ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్‌ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది.

అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్‌ వరంగల్‌ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్‌ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు ఓవరాల్‌ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. 
చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు

ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం 
ఇంజనీరింగ్‌ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్‌ సరి­కొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్‌ అనుబంధ కాలేజీలున్న జేఎన్‌టీయూ–హెచ్‌ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్‌ వరంగల్‌ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీ జాతీయస్థా­యి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్‌ఐటీ హైదరా బా­ద్‌ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది.  

అధ్యాపకుల కొరతే కారణం: 
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
-ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ 

ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ 
దేశంలో టాప్‌–40 వ్యవసాయ విశ్వవిద్యాలయా­లు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీ­యగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్ర­మా­ణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. 

అడ్రస్‌ లేని మెడికల్‌ కాలేజీలు 
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో దేశంలో  టాప్‌ 50లో చోటు దక్కని వైనం 
సాక్షి, హైదరాబాద్‌:
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ చేసిన దేశంలోని టాప్‌–50 మెడికల్‌ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్‌ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్‌ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టాప్‌–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యు­కేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఐదో ర్యాంకు సాధించా­యి.

డెంటల్‌ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊ­రట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలే­జీ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్‌ కాలేజీలు, 155 డెంటల్‌ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేద­ని, అలా­గే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement