
ఈ నెలలో రూ.500 కోట్లు విడుదల
మార్చి వరకు ప్రతినెలా రూ.340 కోట్లు
100 పడకలు దాటిన ఆస్పత్రి నిర్వహణ బాధ్యత గ్రూప్–1 అధికారులకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయిన ఎనిమిది వైద్య కళాశాలలను తొలుత అందుబాటులోకి తెచ్చేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కళాశాలలకు చెందిన 30 ఎకరాల ఆవరణ లో వైద్య విద్యార్థులకు హాస్టళ్లు, పారా మెడికల్ కాలేజీ, బోధనాస్పత్రి, ఎంసీహెచ్‌తోపాటు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం ఈ నెలలో రూ. 500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి 2026 మార్చి వరకు ప్రతినెలా రూ. 340 కోట్లు కేటాయిస్తారు. ఈ మేర కు సీఎం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో విడుదల కానున్న రూ. 500 కోట్ల నుంచి తొలిదశలో చేపట్టిన 8 వైద్య కళాశాలల నిర్మాణానికి సంబంధించిన బకాయిల చెల్లింపు, మిగిలిపోయిన పనుల పూర్తికి వెచ్చిస్తారు.
మొదటి దశ కాలేజీలే ముందుగా...
రాష్ట్రంలో 2021 వరకు 9 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండగా, ఆ ఏడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం 8 కొత్త కాలేజీలను ప్రకటించింది. సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, వనపర్తి, మంచిర్యాల, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలోని 8 మెడికల్ కాలేజీల్లో 2022 నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే తాత్కాలికంగా వేర్వేరు చోట్ల కళాశాలలను ఏర్పాటు చేసి, జిల్లా ఆస్పత్రులను అనుబంధ ఆస్పత్రులుగా మార్చి ఎంబీబీఎస్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల నిర్మాణ పనులు దాదాపు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి.
ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్ల విధి వైద్యమే...
వైద్య సంబంధమైన అంశాలపై సూపరింటెండెంట్లు దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతల నుంచి సూపరింటెండెంట్లను తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఆస్పత్రుల్లో వైద్యం, వైద్యేతర అంశాలను విడివిడిగా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా 100 పడకలు దాటిన ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను గ్రూప్–1 స్థాయి అధికారులకు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన గ్రూప్–1 స్థాయి అధికారుల్లో తొలుత 20 మందిని ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు కేటాయించాలని ఆదేశించినట్టు సమాచారం.
» జోన్–1లో 65 ఏఓ పోస్టులు ఖాళీగా ఉండగా, జోన్–2లో 49 పోస్టులు వేకెంట్‌గా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా సూపరింటెండెంట్లకు పనిభారం తగ్గించనున్నారు.