బీరెల్లి కుట్ర కేసుపై ఎన్‌‘ఐ’ఏ! | Sakshi
Sakshi News home page

బీరెల్లి కుట్ర కేసుపై ఎన్‌‘ఐ’ఏ!

Published Sat, Jul 1 2023 2:53 AM

NIA on the Birelli conspiracy case - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘బీరెల్లి’కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 152/2022 ప్రకారం 2022, ఆగస్టు 19న 152 మందిపై కేసు నమోదైంది.

తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు నేతలతోపాటు కొందరు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు (ప్రాక్షన్‌ కమిటీ మెంబర్లు) సమావేశం ఆయ్యారనేది ఆ ఎఫ్‌ఐఆర్‌లోని సారాంశం. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తోపాటు 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా 152 మందిపై నేరాభియోగం మోపారు. ఈ కేసు ఇటీవల వివాదాస్పదం కావడంతో డీజీపీ ఆదేశాల మేరకు విచారణ జరిపారు.

ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ ప్రొఫెసర్‌ హరగోపాల్‌తోపాటు జస్టిస్‌ సురేష్‌ (లేట్‌), వి.రఘునాథ్, జర్నలిస్ట్‌ పద్మజా షా, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్‌లపై ‘ఉపా’కేసులు ఎత్తివేశారు. ఈ మేరకు జూన్‌ 17న ప్రకటన చేసిన ములుగు ఎస్పీ గౌస్‌ ఆలం.. మిగతా వారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసు పూర్వాపరాలపై ఎన్‌ఐఏ ఆరా తీస్తుండటం చర్చనీయాంశమైంది.  

‘ఉపా’కేసులో ఎన్‌ఐఏ ఆరా 
2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కుట్ర కేసులో 152 మంది పేర్లుండగా.. అందులో చాలా మందిని గతంలో నిందితులుగా ఎన్‌ఐఏ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్‌ విద్యార్థినిని మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు కిడ్నాప్‌ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసినా.. 2021 మే 31వ తేదీన కేసు మళ్లీ తెరిచి దర్యాప్తు చేయాలని ఎన్‌ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో 2022 సెప్టెంబర్‌ మొదటి వారంలో కేసును స్వీకరించిన ఎన్‌ఐఏ రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్‌ జిల్లాల్లో సోదాలు నిర్వహించి హైకోర్టు న్యాయవాది, చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) సభ్యురాలు చుక్కా శిల్పను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. డి.దేవేంద్ర, దుబాసి స్వప్నలను కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. పర్వతపురంలోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేడ్కర్‌ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్‌ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇదే క్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో క్రియాశీలకంగా పని చేశారన్న సమాచారంతో హనుమకొండకు చెందిన సముద్రాల అనిత, ఆమె తల్లి ఇంట్లో కూడా 2022 సెపె్టంబర్‌ 5న దాడులు చేయడం అప్పట్లో కలకలం రేపింది. వీరందరితోపాటు మరో నలభై మంది వరకు వివిధ కేసుల్లో ఎన్‌ఐఏ నిందితులుగా పేర్కొన్న వారి పేర్లు కూడా ‘బీరెల్లి’కుట్ర కేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆరా తీస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  

వివరాలు సేకరించిన ఏపీ ఇంటెలిజెన్స్‌
ములుగు జిల్లా తాడ్వాయి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. 13 మంది మావోయిస్టు పా ర్టీల నేతలతోపాటు 20 సంఘాలకు చెందిన 146 మందిపై 10 సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ జరుగుతోంది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రజాసంఘాల ప్రతినిధుల పేర్లుండగా.. ఇదే కేసు విషయమై ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రెండు రోజుల క్రితం ములుగు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినట్లు తెలిసింది. తాడ్వాయి, పస్రా ఎస్‌హెచ్‌వోలు, స్పెషల్‌బ్రాంచ్‌ అధికారులతోనూ మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement