పునాదులు కదులుతున్నాయ్‌..! | - | Sakshi
Sakshi News home page

పునాదులు కదులుతున్నాయ్‌..!

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

విద్యా పురస్కారాల వేడుకలో

సీఎం విజయ్‌ వ్యాఖ్యలు

విద్యా రంగంలో అవినీతి,

పుస్తకాల స్కాంపై ఫైర్‌

ప్రతిపక్షాల సవాళ్ల మేరకు ఫైళ్లను

తెరిచానని స్పష్టీకరణ

అవినీతిని అరికట్టడానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల తాజాగా

కొందరి పునాదులే కదిలిపోతున్నాయని

సీఎం విజయ్‌ పేర్కొన్నారు. చైన్నెలోని నీలాంకరైలో తమిళగ వెట్రి కళగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా పురస్కారాలు, నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమం

రెండో విడత సభలో ఆయన ప్రసంగిస్తూ

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాక్షి, చైన్నె: ప్రతి నియోజకవర్గంలో 10వ తరగతి, ప్లస్‌ – 2 పబ్లిక్‌ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గత మూడేళ్లుగా టీవీకే ఈ పురస్కారాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈ ఏడాదికి గాను మొదటి విడత కార్యక్రమాన్ని గత నెల 4న చైన్నెలో నిర్వహించారు. అప్పుడు అరియలూరు, కడలూరు, కల్లకురిచి, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు సీఎం అవార్డులు అందజేశారు. రెండో విడత అవార్డుల ప్రదానోత్సవం చైన్నె నీలంకరైలోని ఆర్‌కే కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం జరిగింది. మధ్యాహ్నం నుంచి సయంత్రం వరకు ఈ వేడుక జరిగింది. ఇందుకోసం ఆయా జిల్లాల పార్టీ కార్యదర్శుల పర్యవేక్షణలో కోయంబత్తూరు, ఈరోడ్‌, తిరుప్పూర్‌, నీలగిరి, పెరంబలూరు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10వ, 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను చైన్నెకు తీసుకొచ్చారు. వీరికి సీఎం విజయ్‌ చేతల మీదుగా పురస్కారాలు అందజేశారు. అదే సమయంలో కొందరు విద్యార్థులు ప్రసంగిస్తూ సీఎం పనితీరును మెచ్చుకుంటూ, ఆయనకు మద్దతుగా వ్యాఖ్యల తూటాలను పేల్చారు.

శ్రీలంక తమిళ శరణార్థులకు కానుక..

ముందుగా సచివాలయంలో పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం సీఎం విజయ్‌ కీలక పథకాలను ప్రారంభించారు. కృష్ణగిరి జిల్లా పాంబారు డ్యామ్‌ శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో నిర్మించిన 148 నూతన గృహాలను ఆయన ప్రారంభించారు.

పెరిగిన నెలవారీ ఆర్థిక సాయం వివరాలు..

శరణార్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ నగదు భృతిని పెంచింది. దీనివల్ల రాష్ట్రంలోని 19,710 కుటుంబాలకు చెందిన 56,638 మంది శ్రీలంక తమిళులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 14 కోట్ల 95 లక్షలను అదనంగా ఖర్చు చేయనున్నారు.కుటుంబ పెద్దకు రూ. 1,500 నుంచి రూ. 1,800లకు పెంచారు. కుటుంబ సభ్యులు (12 ఏళ్లు, ఆపై వయసు వారికి) రూ. 1,000 నుంచి రూ. 1,200లకు, పిల్లలకు (12 ఏళ్లలోపు వారికి) రూ. 500 నుంచి రూ. 600లకు పెంచారు. ఈ పెంచిన ఆర్థిక సాయానికి గుర్తుగా సీఎం విజయ్‌ 4 కుటుంబాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి కె. తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎం. సాయికుమార్‌, ప్రజా, పునరావాస శాఖ కార్యదర్శి ఎ. సుందరవల్లి, అయలగ తమిళుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌. వలర్మతి, సంయుక్త కార్యదర్శి సంగీత తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అవినీతిపై ఉపేక్షించేది లేదు..

ఈ సందర్భంగా సీఎం విజయ్‌ ప్రసంగిస్తూ, అవినీతి అనేది ఎప్పటినుంచో ఉన్న సమస్య అయినప్పటికీ, ప్రజలకు అది అలవాటైపోయిందన్నట్లుగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరాలకు పునాది అయిన విద్యా రంగంలోనే అవినీతి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని విజయ్‌ ప్రశ్నించారు. తన టేబుల్‌పై మూడు కీలక ఫైళ్లు ఉన్నాయని తాను చెప్పినప్పుడు, వాటిని తెరిచి చూడాలని ప్రతిపక్ష పార్టీలే అసెంబ్లీలో సవాల్‌ చేశాయని విజయ్‌ గుర్తుచేశారు. వారు అడిగిన తర్వాత తాను చేతులు కట్టుకుని కూర్చోలేను కదా అని తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. గ్రంథాలయ పుస్తకాల విషయంలో, ముఖ్యంగా ఏఐ ద్వారా పుస్తకాల సేకరణలో భారీ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అవినీతి భాగోతాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. విద్యార్థులు జీవితంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాలు చెబుతున్నానని, వారిని ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే నడిపిస్తానని సీఎం విజయ్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement