కొళత్తూరు ఉప ఎన్నికపై డీఎంకే ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

కొళత్తూరు ఉప ఎన్నికపై డీఎంకే ఉత్కంఠ

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

● రేసులో స్టాలిన్‌ లేనట్లేనా? ● పరిశీలనలో ముగ్గురి పేర్లు

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే వి.ఎస్‌. బాబు మృతితో ఖాళీ అయిన చైన్నెలోని కొళ త్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, డీఎంకే తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011, 2016, 2021 ఎన్నికలలో కొళత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి వి.ఎస్‌. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నిక వస్తుండటంతో స్టాలిన్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని పార్టీ సీనియర్‌ నేతలు పట్టుబడుతున్నారు. అయితే, అధికార పార్టీ పూర్తి బలానికి వ్యతిరేకంగా పోటీ చేయడంలోని రాజకీయ సమీకరణాలు, ఇతర ఖాళీ స్థానాల ప్రచారంపై దృష్టి సారించాల్సిన అవసరం దృష్ట్యా స్టాలిన్‌ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రేసులో ముగ్గురు

ఒకవేళ ఎం.కె. స్టాలిన్‌ పోటీ నుంచి తప్పుకుంటే, ఆయన స్థానంలో బరిలోకి దింపేందుకు ముగ్గురు నేతల పేర్లను డీఎంకే నాయకత్వం పరిశీలిస్తున్నది. ఇందులో డీఎంకే వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ ఎళిలన్‌ పార్టీకి బలమైన ముఖంగా ఉన్నారు. 2021 ఎన్నికల్లో థౌజండ్‌ లైట్ప్‌నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు. విద్యావంతులైన యువత, మధ్యతరగతి వర్గాల్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. అధికార పార్టీపై బలంగా గళం వినిపించగల నాయకుడిగా ఆయన పేరును పరిశీలిస్తున్నారు. అలాగే, అన్నానగర్‌, విల్లివాక్కం, కొళత్తూరు ప్రాంతాల్లో చురుకై న డీఎంకే యువత నేతగా కార్తీక్‌ మోహన్‌కు గుర్తింపు ఉంది. 2026 ఎన్నికల్లో కొళత్తూరు పక్కనే ఉన్న విల్లివాక్కం నుంచి పోటీ చేశారు. స్థానిక ప్రజలతో సన్నిహిత సంబంధాలు, క్షేత్రస్థాయి ఎన్నికల వ్యూహాలపై పట్టు ఉన్నందున, స్థానిక అభ్యర్థి కోటాలో ఆయనకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు సూచిస్తున్నారు. డీఎంకే యువ వక్తల విభాగం, కనిమొళి బృందంకు చెందిన వైద్యుల విభాగం ప్రతినిధి డాక్టర్‌ యాళిని పేరు కూడా పరిశీలనలో ఉంది. సోషల్‌ మీడియా వేదికగా పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ క్షేత్రస్థాయి నుంచి యాళిని ఎదిగారు. యువత, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడంతో పాటు మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంతో ఆమె పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొళత్తూరు నియోజకవర్గం ఎం.కె. స్టాలిన్‌ రాజకీయ ప్రస్థానంతో ముడిపడి ఉండటంతో, ఇక్కడ విజయం సాధించడం డీఎంకేకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాత, పార్టీ సీనియర్లతో చర్చించి స్టాలిన్‌ అధికారిక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement