సాక్షి, చైన్నె: కాశీ తమిళ సంగమం 5.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రతినిధుల తొలిబృందం ప్రత్యేక రైలును తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ఉదయం చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. కన్యాకుమారి నుంచి బయలుదేరి ఎగ్మోర్ చేరుకున్న ఈ రైలులో చైన్నె నుంచి 105 మంది సహా మొత్తం 207 మంది ప్రతినిధులు బనారస్‌కు పయనమయ్యారు. ఈ రైలు శుక్రవారం వారణాసి చేరుకోనుంది. తమిళనాడు – కాశీ మధ్య ఉన్న ప్రాచీన నాగరికత, సాంస్క్కృతిక, మేధో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద 2022లో కాశీ తమిళ సంగమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరగనున్న ఐదో విడత సంగమంలో పాల్గొనేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, రైతులు సహా 7 విభాగాల నుంచి సుమారు 1,500 మందిని ఎంపిక చేశారు. వీరి ప్రయాణం కోసం తమిళనాడు నుంచి బనారస్‌కు 7 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
కాశీ విద్యార్థులకు తిరుక్కురళ్ బోధన
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది ‘తిరుక్కురళ్‌ను అధ్యయనం చేద్దాం – తిరుక్కురళ్ అభ్యాస్ కరెన్’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. విద్యార్థులతో పాటు 100 మంది ఉపాధ్యాయులు వారణాసి వెళ్లి, అక్కడి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు తిరుక్కురళ్ విశిష్టతను బోధించనున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువతకు తిరుక్కురళ్ ఆదర్శాలు మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అంతకుముందు గవర్నర్ ఆర్లేకర్ విద్యార్థి ప్రతినిధులతో ముచ్చటించి, రెండు ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని అనుసంధానిస్తున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ స్టడీస్ డైరెక్టర్ చంద్రశేఖర్, చైన్నె డివిజనల్ అదనపు రైల్వే మేనేజర్ సెంథిల్‌కుమార్ పాల్గొన్నారు.


