శ్రీవారు, శ్రీ పద్మావతి ఆలయాల్లో టీటీడీ క్యాలెండర్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారు, శ్రీ పద్మావతి ఆలయాల్లో టీటీడీ క్యాలెండర్‌

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

కొరుక్కుపేట: రాబోయే నూతన సంవత్సరం 2027ను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం టీటీడీ క్యాలెండర్‌ , డైరీలను అందుబాటులోకి తెచ్చింది. ఏటా విశేష ఆదరణ పొందే టీటీడీ డైరీలు, క్యాలెండర్లను చైన్నెతోపాటు రాష్ట్రంలోని భక్తులు కోసం చైన్నె టి.నగర్‌ లోని వెంకటనారాయణ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే జీఎన్‌ శెట్టి రోడ్డు లోని శ్రీ పద్మావతి ఆలయంలలో టీటీడీ క్యాలెండర్‌ ,డైరీలు, డెస్క్టాప్‌ క్యాలెండర్లు అమ్మకానికి ఉంచామని చైన్నె టీటీడీ సమాచార కేంద్రం సహాయ కార్యనిర్వహణాధికారి ధనంజయ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాలెండర్‌ విక్రయాలకు యూపీఐ, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు స్వీకరిస్తారని వెల్లడించారు. శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో

రూ. 1,100 కే డయాలసిస్‌ సేవలు

– త్వరలో అధికారిక ప్రకటన

సాక్షి, చైన్నె: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి రోగులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆరోగ్య బీమా కార్డు లేని వారికి కూడా ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులలో కేవలం రూ. 1,100 నామమాత్రపు రుసుముతో డయాలసిస్‌ చికిత్సను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా ప్రస్తుతం తమిళనాడులోని ప్రభుత్వ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆసుపత్రుల పరిధిలో మొత్తం 146 డయాలసిస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 9,400 మంది రోగులకు 9 లక్షలకు పైగా డయాలసిస్‌ సెషన్లను నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సీటీ స్కాన్‌ , ఎంఆర్‌ఐ పరీక్షలను అత్యంత తక్కువ ధరకే అందిస్తున్న తరహాలోనే, డయాలసిస్‌ వ్యవస్థను కూడా పూర్తిగా తమిళనాడు మెడికల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనివల్ల రోగులు తమ సొంత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులలోనే వేగంగా, తక్కువ ఖర్చుతో చికిత్స పొందే వీలు కలుగుతుంది.

త్వరలోనే అధికారిక ప్రకటన

ఈ ప్రాజెక్టుపై తమిళనాడు మెడికల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.పి. అమృత్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద ఒక డయాలసిస్‌ చికిత్సకు రూ. 1,100 కేటాయిస్తున్నారన్నారు. ఆరోగ్య బీమా లేని సామాన్య రోగులకు కూడా అదే రూ. 1,100 రుసుముతో ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్‌ అందించే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్‌ సంస్థలతో పోలిస్తే తాము స్కానింగ్‌ పరీక్షలను చాలా తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. డయాలసిస్‌ సేవలను కూడా అదే పద్ధతిలో అమలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

టీవీకేలో చేరికపై మన్నార్గుడి

ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

– పార్టీ మార్పుపై ఒత్తిడి లేదన్న కామరాజ్‌

సాక్షి, చైన్నె : తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, తగిన సమయం వచ్చినప్పుడు తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని మన్నార్గుడి ఎమ్మెల్యే ఎస్‌. కామరాజ్‌ స్పష్టం చేశారు. మన్నార్గుడిలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్వాహకులతో మాట్లాడుతూ ఆయన తన రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నానని కామరాజ్‌ తెలిపారు. మన్నార్గుడి రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి రూ. 46 కోట్లు కేటాయించినందుకు ఆయన తమిళనాడు ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలియజేశారు. తాను ఇటీవల సీఎం విజయ్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ, నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. మన్నార్గుడిలో సమీకృత కోర్టు సముదాయ నిర్మాణం, శ్మశానవాటిక ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరానని వివరించారు. డెల్టా ప్రాంతంలో వ్యవసాయ పనులు దెబ్బతిన్నందున రైతులకు, వ్యవసాయ కార్మికులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాననని చెప్పారు.ఈ అంశాలన్నింటినీ శ్రద్ధగా విన్న సీఎం విజయ్‌, డెల్టా జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు ఒక ప్రత్యేకబృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారన్నారు. టీవీకేలో చేరే అంశంపై స్పందిస్తూ, ప్రస్తుతం టీవీకేలో చేరమని తనపై ఎవరి ఒత్తిడీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement