విద్యార్థుల నిరసనల హోరు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నిరసనల హోరు

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

● పలు చోట్ల అరెస్టులు ● డీఎంకే ఖండన

● పలు చోట్ల అరెస్టులు ● డీఎంకే ఖండన

సాక్షి, చైన్నె : సీఈసీకి వ్యతిరేకంగా తమిళనాట సైతం నిరసనలు బయలు దేరాయి. చైన్నెలో పలు చోట్ల విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. అయితే, వారిని పోలీసులు అరెస్టు చేయడం విమర్శలకు దారి తీశాయి. ఎస్‌ఐఆర్‌ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా పోరాటాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థులు పోరాట బాట పట్టడంతో ఉత్కంఠ బయలు దేరింది. చైన్నెలో చేపాక్కం, బీసెంట్‌ నగర్‌,త దితర పలు ప్రాంతాలలో సీఈసీకి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కారు. అయితే, వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం విమర్శలకు దారి తీసింది. టీవీకే ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండి పడుతున్నారు. అదే సమయంలో చైన్నెతో పాటుగా ఢిల్లీలోనూ సాగుతున్న అరెస్టుల పర్వంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, అసెంబ్లీ ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై జరుగుతున్న అణచివేతలు.. నాటి అత్యవసర పరిస్థితిని మళ్లీ కళ్లముందు తీసుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థుల అరెస్టును ఖండిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

భూ ఆక్రమణదారుల

వివరాలు అందించండి

– కడలూరు కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, చైన్నె: కడలూరు జిల్లా వడలూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వల్లలార్‌ దైవ నిలయం (సత్యజ్ఞాన సభ) భూమిని ఆక్రమించిన వారి వివరాలను నాలుగు వారాల్లోగా హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖకు అందించాలని మద్రాసు హైకోర్టు కడలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సత్యజ్ఞాన సభకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిలో ఆక్రమణలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జి. జయచంద్రన్‌ , ఇ. మనోహరన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా 2024లోనే ఆక్రమణదారులను గుర్తించినప్పటికీ, వివరాల సమర్పణలో జాప్యం జరగడంపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. రానున్న నాలుగు వారాల్లోగా ఆక్రమణదారుల వివరాలను ధార్మిక శాఖకు నివేదించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వివరాలు అందిన వెంటనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను స్పష్టం చేశారు. సత్యజ్ఞాన సభ పరిధి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఇప్పటికే భూమిని సర్వే చేశామని, నిధుల అంచనా నివేదిక కోసం వేచి చూస్తున్నామని ధార్మిక శాఖ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం, ప్రహరీ గోడ నిర్మాణానికి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది.

కడలూరు ఎస్పీకి నోటీసులు

పెరువేలి ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన రక్షణ కంచెకు జరిగిన నష్టంపై పోలీసు దర్యాప్తు మందకొడిగా సాగడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కడలూరు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను ప్రతివాదిగా చేర్చిన ధర్మాసనం, కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి నివేదికను నవంబర్‌ 5 లోగా దాఖలు చేయాలని ఆదేశించింది.

పీఎంకే ఎన్డీయే కూటమిలోనే ఉంది!

– అన్నాడీఎంకే ఆత్మ పరిశీలన చేసుకోవాలి

– అన్బుమణి రాందాసు సలహా

సాక్షి, చైన్నె : పీఎంకే ఎన్‌డీఏ కూటమిలోనే కొనసాగుతోందని ఆ పార్టీ నేత, డాక్టర్‌ అన్బుమణి రామదాస్‌ స్పష్టం చేశారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధాన ంగాఉప ఎన్నికల గురించి ఆయన స్పందించారు. ఈ ఉప ఎన్నికలలో అధికార పార్టీ విజయం సాధించగా, కొన్ని నెలల క్రితం గెలిచిన అన్నాడీఎంకే తాజాగామూడో స్థానంలోకి నెట్ట బడిందన్నారు. దీనిపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తాను అన్నాడీఎంకే విమర్శించడం లేదని, కేవలం మంచి ఉద్దేశంతోనే ఈ సలహా ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రజా సమస్యలు – ప్రభుత్వ వైఫల్యం

రాష్ట్రంలో నీట్‌ పరీక్ష సమస్య, కావేరి నీటి వివాదం, ఎల్‌ నినో ప్రభావం, భారీ వర్షాలు, తుఫానులు వంటి అనేక సమస్యలు ఉన్నాయని అన్బుమణి ఆందోళన వ్యక్తం చేశారు. మేట్టూరు డ్యామ్‌లో ప్రస్తుతం కేవలం 30 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖనిజ వనరుల అక్రమ రవాణా, దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అంతర్గత విచారణ జరిపి, సీబీఐ దర్యాప్తుకు పట్టుబడితేనే అసలు నిజాలు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. మేఘదాతు డ్యామ్‌ సమస్యపై తమిళనాడు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీవీకే కూటమిలోకి వెళ్తున్నారా..?, సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా..? అని ప్రశ్నించగా, తాము ఎన్‌డీఏ కూటమిలో ఉన్నాం..అ ని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement